Annamayya News : భర్త వెంటే భార్య, గంటల వ్యవధిలో దంపతుల మృతి
Annamayya News : గంటల వ్యవధిలో భార్యాభర్తలు చనిపోయిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. భర్త గుండెపోటుతో మరణించగా ఆయన మృతిని తట్టుకోలేక భార్య కన్నుమూసింది.
Annamayya News : అన్నమయ్య జిల్లాలో గంటల వ్యవధిలో దంపతుల మృతి చెందారు. మూడు నెలల కిందట భార్య అనారోగ్యానికి గురై మంచానికి పరిమితం అయింది. భార్య పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయిన భర్త గుండె ఆగిపోయింది. భర్త లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆమె కూడా ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగింది. మదనపల్లె పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన చలపతినాయుడు (74) బీటీ కళాశాలలో రికార్డు అసిస్టెంటుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సతీమణి పద్మావతమ్మ (64) గృహిణి. పద్మావతమ్మ మూడు నెలల కిందట అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కీమోథెరపీ చికిత్స చేయిస్తున్నారు. భార్య మంచానికి పరిమితం కావడంతో చలపతి నాయుడు కుంగిపోయారు. కుమార్తె, ఇద్దరు కుమారుడు ఆయనకు ధైర్యం చెబుతున్నా భార్య పరిస్థితిని చూసి తరచూ బాధపడేవారు. గురువారం మధ్యాహ్నం చలపతి నాయుడు గుండెపోటుతో మృతి చెందారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా పద్మావతమ్మ తుదిశ్వాస విడిచారు. భార్యా భర్తలిద్దరూ గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బెంగళూరు రోడ్డులోని స్మశాన వాటికలో శుక్రవారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.
చావు కూడా విడదీయలేకపోయింది
నీవులేక నేను లేనని ఎన్నిసార్లు చెప్పి ఉంటాడో. ఆమె ఎన్నిసార్లు మురిసిపోయి ఉంటుందో. కానీ ఇప్పుడు అదే నిజమయ్యేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు జనం. నిజమైన ఆదర్శ దంపతులు వాళ్లే అని స్థానికులు అనుకుంటున్నారు. భార్య మరణించిన రోజునే భర్త కూడా తనువు చాలించిన ఘటన జనగామ జిల్లాలో ఇటీవల జరిగింది. పెళ్లి బంధంతో ఒక్కటైన ఆ జంటను చావు కూడా విడదీయలేకపోయింది. ఇద్దరూ కలిసే తనువు చాలించారు. ఈ విషాద సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లిలో జరిగింది. కేశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెన్నూరు ఆంజనేయులు - లక్ష్మీ దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. హ్యాపీగా ఉన్న టైంలో లక్ష్మీ అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఆమెపై బెంగతో ఆంజనేయుల అరోగ్యం కూడా క్షీణించింది. ఇలా అనారోగ్యం పాలైన ఇద్దరు ఒకే రోజు తనువు చాలించారు. ఈ జంట మరణంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక సర్పంచ్ మల్లవరం దివ్య - అరవింద్ రెడ్డి దహన సంస్కారాలు చేపట్టారు. మృతి చెందిన దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు కొంత నగదు సాయం చేశారు.
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు చనిపోయారు. కారు ఢీకొనడంతో భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పూతలపట్టు మండలం, తిమ్మిరెడ్డిపల్లికి చెందిన భార్యాభర్తలు కాణిపాకం వినాయకుడిని దర్శించుకోవాలనుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన వద్ద భార్యాభర్తలు బస్ స్టాప్ వద్దకు నడిచి వెళుతుండగా పీలేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన భార్యాభర్తలను తిమ్మిరెడ్డిపల్లికి చెందిన చెంగల్ రెడ్డి, కస్తూరిగా గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని పరిశీలించారు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరిని ఢీకొట్టిన కారు వివరాలు సేకరించే ప్రయత్నం మొదలుపెట్టారు.