Top 5 Telugu Headlines Today 22 October 2023:


Telangana BJP candidates List: తెలంగాణ బీజేపీ తొలి జాబితా వచ్చేసింది - కేసీఆర్ పై ఈటల పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. రెండ్రోజులుగా ఢిల్లీలో మేథో మథనం అనంతరం 52 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. అలాగే, హుజూరాబాద్ నుంచి కూడా బరిలో నిలవనున్నారు. కరీంనగర్ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్, దుబ్బాక నుంచి రఘునందన్ రావు పోటీ చేయనున్నారు. పూర్తి వివరాలు


'విశాఖ రాజధాని ఇప్పట్లో లేనట్లే' - బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందన్న ఆయన, కోర్టు తీర్పు ఆధారంగానే రాజధాని అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు తీర్పు కంటే ముందే సీఎం వచ్చి కూర్చుంటారంటే ఎవరూ అభ్యంతరం చెప్పబోరన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని ఆరోపించారు. మరోవైపు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబరు నుంచే విశాఖ నుంచి పాలన అందించేందుకు రెడీ అవుతున్నారు. పూర్తి వివరాలు


ఆంధ్రా రొయ్య రేటు అదుర్స్ - ఫలించిన ప్రభుత్వ ప్రయత్నాలు, దేశంలోనే మెరుగైన గిట్టుబాటు ధరలు
ఆంధ్రప్రదేశ్‌‌లో రొయ్యల పెంపకం లాభసాటిగా మారింది. ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రొయ్యలకు అత్యధిక గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఆక్వా రైతులకు మెరుగైన గిట్టుబాటు ధరలు దక్కుతున్నాయి. గత జులైలో ప్రాసెసింగ్ యూనిట్లతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ధరలు పెంచడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వివరించింది. ఈ నేపథ్యంలోనే  ఆక్వా సాధికారత కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రకటించిన ధరలను మరోసారి పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి. పూర్తి వివరాలు


బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత - గోషామహల్ నుంచే పోటీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్ఠానం సస్పెన్షన్ ఎత్తివేసింది. బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను గతేడాది ఆగస్టులో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రాజాసింగ్ వివరణ ఇవ్వగా, దీన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం ఆయనపై సస్పెన్షన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాలు   


'మనం చేద్దాం జగనాసుర దహనం' - మరో వినూత్న నిరసనకు టీడీపీ పిలుపు
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మరో వినూత్న నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. విజయదశమి పండుగను చెడుపై మంచి విజయంగా జరుపుకొంటారని, సైకో జగన్ అనే చెడుపై చంద్రబాబు అనే మంచి సాధించబోయే విజయంగా జరుపుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. 'దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దా జగనాసుర దహనం' అంటూ సోమవారం (అక్టోబర్ 23) రాత్రి 7 గంటల నుంచి 7:05 నిమిషాల మధ్య మరో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాలు