విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందన్న ఆయన, కోర్టు తీర్పు ఆధారంగానే రాజధాని అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు తీర్పు కంటే ముందే సీఎం వచ్చి కూర్చుంటారంటే ఎవరూ అభ్యంతరం చెప్పబోరన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని ఆరోపించారు.
విశాఖ నుంచి పాలనకు సీఎం రెడీ
మరోవైపు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబరు నుంచే విశాఖ నుంచి పాలన అందించేందుకు రెడీ అవుతున్నారు. రుషికొండపై 4 బ్లాకుల్లో మొత్తం 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవనాల నిర్మాణం జరుగుతోంది. ముఖ్యమంత్రి నివాసంతో పాటు క్యాంపు కార్యాలయం ఉండనున్నాయి. ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్ ఉపయోగిస్తారన్న ప్రచారం సాగుతోంది. రుషికొండ చుట్టూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కొండ చుట్టూ 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, 24 గంటలూ నిఘా తీవ్రం చేశారు. కొండ వద్ద విశాఖ- భీమిలి బీచ్ రోడ్డు వైపు 2, కొండ వెనుక సముద్ర తీరంలో ఓ తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు.
అధికారుల విస్తృత ఏర్పాట్లు
సీఎం జగన్ ప్రకటనతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి, సీఎంవోలో కీలక అధికారుల నివాసాలకు అవసరమైన భవనాలను గుర్తించేందుకు ఐఏఎస్‌లతో ప్రభుత్వం కమిటీ నియమించింది. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ, విశాఖ నగరంలో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు సేకరించే పనిలో బిజీ అయ్యారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ విభాగం కార్యదర్శి పోలా భాస్కర్ ఇప్పటికే జిల్లా అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. ఏయే ప్రాంతంలో ఏయే భవనాలు ఖాళీగా ఉన్నాయి ? ఆ భవనాల విస్తీర్ణం ఎంత ? ఏ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంది ? భద్రతాపరంగా లోపాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలపై ఐఏఎస్ ల కమిటీ వివరాలు సేకరిస్తోంది. రుషికొండ వద్ద రాడిసన్ బ్లూ హోటల్ ఎదురుగా ఉన్న పర్యాటక శాఖకు చెందిన మూన్ ల్యాండ్ ప్రాజెక్టు స్థలంపై అధికారులు ఆరా తీస్తున్నారు.