AndhraPradesh News: ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల పెంపకం లాభసాటిగా మారింది. ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రొయ్యలకు అత్యధిక గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఆక్వా రైతులకు మెరుగైన గిట్టుబాటు ధరలు దక్కుతున్నాయి. గత జులైలో ప్రాసెసింగ్ యూనిట్లతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ధరలు పెంచడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వివరించింది. ఈ నేపథ్యంలోనే ఆక్వా సాధికారత కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రకటించిన ధరలను మరోసారి పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఆక్వా రైతులు అందరి కంటే మిన్నగా మెరుగైన ధరనే పొందుతున్నారు. ఏపీలో 100 కౌంట్ ధర రూ.240 పలుకుతుండగా, గుజరాత్, మహారాష్ట్రలో రూ.230 మాత్రమే లభిస్తుంది. అలాగే ఏపీలో 30 కౌంట్ ధర రూ.420 ఉండగా, మహారాష్ట్రలో రూ.400, గుజరాత్, ఒడిశాలో రూ.380గా ఉంది. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో రొయ్యల ధరలను ప్రతి పది రోజులకోసారి అధికారులు సమీక్షిస్తున్నారు. రైతులకు మెరుగైన ధర అందించడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిపై ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా..
దేశంలో ఒక్క ఏపీలో మాత్రమే కౌంట్‌ల వారీగా ధరలను ప్రకటిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పూర్వం నుంచి కొనసాగుతున్నట్టుగా ప్రతి 10 కౌంట్లకు ఒక ధర చొప్పున నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకటించిన కౌంట్ ధరలు పొరుగు రాష్ట్రాలతో కంటే మెరుగ్గా ఉన్నాయి. తమిళనాడు, ఒడిశా, గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ప్రధాన కౌంట్లకు ఏపీ కంటే కేజీకి రూ.5 నుంచి రూ.25 వరకు తక్కువగానే చెల్లిస్తున్నారు.
రైతు సాధికారత సమితి పర్యవేక్షణలో..
ఆక్వా రైతుల కోసం ఏపీ ప్రభుత్వంలోని రైతు సాధికారత కమిటీ నిరంతరం కృషి చేస్తోంది. ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకూడదన్న లక్ష్యంతో సీఎం జగన్ ఎప్పటికప్పుడు రైతు సాధికారత కమిటీతో సమావేశం అవుతూ రొయ్యల ధరలను పెంచేందుకు కృషి చేశారు. ఆక్వా రైతుల సమక్షంలో ప్రాసెసింగ్ కంపెనీలు, ఎగుమతి దారులతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు జరుపుతున్న చర్చలు మంచి ఫలితమిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కేజీకి రూ.5 నుంచి రూ.10 చొప్పున పెంచేందుకు కంపెనీలు అంగీకరిస్తున్నాయి. పెంచిన ధరలు పది రోజుల పాటు అమలులో ఉంటుండడంతో రైతులకు మేలు జరుగుతోంది.
అంతే కాకుండా ఏజెంట్లు, షెడ్ల నిర్వాహకుల వద్ద ఆక్వా రైతులు మోసపోతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని అడ్డకునేందుకు చర్యలు చేపట్టింది. నిర్దేశించిన ధరల చెల్లింపులో కోత పెడుతున్న ఏజెంట్లు, షెడ్ల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై రైతుల నుంచి కొనుగోలు చేసే వారెవరైనా కచ్చితమైన బిల్లులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. లేకుంటే అప్సడా చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఆక్వా రైతులకు మేలు జరిగినట్లైంది. ఏపీలో ఎక్కువగా నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రొయ్యలు పెంపకం సాగుతోంది.