Bhogapuram Airport: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చుక్కాని అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మే 3న ఏపీ సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు భూమి పూజ చేసి లాంచనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.5 వేల కోట్లతో దీన్ని అభివృద్ధి చేయమన్నారు. 2025 నాటికి 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పనులు పూర్తి చేయాలన్నదే లక్ష్యంతో జీఎంఆర్ సంస్థ అడుగులు వేస్తోంది.
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఈ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం 2,203 ఎకరాలు కేటాయించింది. నిర్వాసితుల పునరావాసం, పరిహారం సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించింది. దీంతో నిర్మాణ సంస్థ పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టింది. తొలుత విమానాశ్రయ భూమి చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టింది. పటిష్టమైన స్తంభాలను నిర్మించి దానిపై పలకలతో దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు ఈ ప్రహరీ ఉంది. దానిపై ఇనుప కంచెను ఏర్పాటు చేయనున్నారు.
పొడవైన రన్ వే
కీలకమైన రన్ వే నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుంది. భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున పటిష్టంగా దీన్ని నిర్మించాల్సి ఉంది. భూమి అంతా ఓ క్రమంలో లేకపోవడంతో తొలుత సగటును పది అడుగుల ఎత్తున మట్టితో చదును చేయడానికి సిద్ధం అవుతున్నారు.
నేరుగా రోడ్డు అనుసంధానం
చెన్నై - కోల్ కతా జాతీయ రహదారిపై ఇటు విశాఖపట్నం, అటు శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు 8 సంఖ్య ఆకారంలో ట్రంపెట్ నిర్మాణం చేపడుతున్నారు. దీని కోసం 25 ఎకరాల భూసేకరణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్లు పరిహారం చెల్లించింది. ఇక విమానాశ్రయానికి ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ముక్కం పంచాయతీలో 5.47 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
సమీపంలోని స్టాఫ్ క్వార్టర్లు
విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్లను జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. ఆ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో 20 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి జాతీయ రహదారి నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అన్ని అడ్డంకులను అధిగమించి
విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమి అంతా నిర్మాణ సంస్థకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులన్నింటిలో ప్రభుత్వం విజయం సాధించింది. 4 గ్రామాల నిర్వాసితులకు దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస కాలనీలను నిర్మించి, మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. త్వరలోనే ఎయిర్ పోర్టు పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.