తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కు ఏమాత్రం పోటీ కాదని, రాబోయే ఎన్నికల్లో గతంలో వచ్చిన 88 స్థానాల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. సీఎం కావాలనే పిచ్చి ఆలోచనలు, ఎజెండాలు తనకేవీ లేవని, తన కంటే సమర్థులు, తెలివైన వారు చాలా మంది ఉన్నారని అన్నారు. 'మా నాయకుడు కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి. ఇందులో ఎవరికీ రెండో ఆలోచన లేదు.' అని స్పష్టం చేశారు. దేశంలో కుంభకోణాల కుంభమేళానే కాంగ్రెస్ అని ఎమ్మెల్యే సీట్లను అమ్ముకునే దౌర్భాగ్యం ఆ పార్టీదని ఆరోపించారు. బీజేపీ నేతలు యుద్ధానికి ముందే చేతులెత్తేశారని, ఈసారి ఆ పార్టీ అభ్యర్థులు 110 చోట్ల డిపాజిట్లు కోల్పోతారని అన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.


కాంగ్రెస్ అంతా కుంభకోణాలే


దేశంలో కాంగ్రెస్ కుంభకోణాల మేళానే అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చేది లేదని, ఆయన దోశలు, ఇడ్లీలు వేయడం బాగా నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఇసుక, భూ మాఫియాలు కాంగ్రెస్ వేనని, కింది నుంచి పై వరకూ సూట్ కేసులు మోసే సంస్కృతి వారిదేనని ధ్వజమెత్తారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఇసుక ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.5,400 కోట్ల ఆదాయం వచ్చిందని, అదే 2004 నుంచి 2014 వరకూ ఇసుక మీద రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.39.40 కోట్లేనని, మరి మిగతా ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లిందని నిలదీశారు. తమది హిందూ పార్టీ అని చెప్పుకునే శివసేనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తెలంగాణకు వచ్చి లౌకిక విలువల గురించి మాట్లాడుతోందని విమర్శించారు.


మే బీటీం కాదు


తాము ఎవరికీ బీ టీం కాదని, ఎంఐఎంతో మాకు పొత్తు లేదని, అది మిత్ర పక్షం మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ముస్లిం, క్రిస్టియన్ సోదరులు కాంగ్రెస్ వైఖరి అర్థం చేసుకోవాలని, తెలంగాణలో మక్తల్, మణికొండ మున్సిపాలిటీల్లో బీజేపీ, కాంగ్రెస్ పదవులు పంచుకోలేదా అని ప్రశ్నించారు. కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల్లో ఒకరికొకరు ఓట్ల మార్పిడి చేసుకోలేదా.? అని నిలదీశారు. 


తెలంగాణ రోల్ మోడల్


తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని కేటీఆర్ అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, కరెంట్, సాగు, తాగునీరు ఇలా అన్ని రంగాల్లో వృద్ధి సాధించామన్నారు. రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలతో అందరికీ సంక్షేమం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ పాలన సాగిస్తున్నట్లు వివరించారు. అలాగే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పదేళ్లలో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. మరో 90 వేల ఉద్యోగాల ప్రక్రియ వివిధ దశల్లో ఉందని పేర్కొన్నారు. TSPSC ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని చక్కదిద్దామని, ఇంకా లోపాలుంటే సరిదిద్దుతామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు.


కేసీఆర్ ప్రజల ఆస్తి


తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది, మూడోసారి ముఖ్యమంత్రి కాబోయేది కేసీఆరేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ప్రజల ఆస్తి అని, ఎక్కడ పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. అక్కడక్కడా ఎమ్మెల్యేల మీద కొంత అసంతృప్తి ఉన్నా, కేసీఆర్ పై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు భీపారాల పంపిణీ కూడా పూర్తైందని, ఎన్నికల ప్రచారంలో ముందున్నామని ఫలితాల్లోనూ ముందుంటామని పేర్కొన్నారు. బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని, ఈటల రాజేందర్ బీజేపీ తరఫున 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలేమో.? అంటూ ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ లోనూ ఈటల ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు.