ICC Cricket World Cup 2023: ఈ ప్రపంచకప్‌లో 20వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 229 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. దక్షిణాఫ్రికా సాధించిన ఈ భారీ విజయంతో పాయింట్ల పట్టికలో వారి స్థానం మెరుగ్గా మారింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా జట్టు మూడో స్థానంలో ఉంది. ఇప్పటికీ మూడో స్థానంలోనే నిలిచింది. కానీ వారి పాయింట్లు, నెట్ రన్ రేట్ బీభత్సంగా పెరిగింది.


పాయింట్ల పట్టిక ఎలా ఉంది?
ఇంగ్లండ్‌కు ఇంత పెద్ద ఓటమిని అందించిన తరువాత, దక్షిణాఫ్రికా జట్టు ఆరు పాయింట్లు, +2.212 నెట్ రన్ రేట్ సాధించింది. ఈ అద్భుతమైన నెట్ రన్ రేట్‌తో ఆఫ్రికా జట్టు ప్రస్తుతం నంబర్-3లో ఉంది. భారత్ నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ కూడా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఎనిమిది పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ భారత్ కంటే మెరుగ్గా ఉంది. అందుకే నంబర్-1లో ఉంది.


ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. వారి తర్వాత రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు పాయింట్లు సాధించిన పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ పరంగా ఆస్ట్రేలియా కంటే వెనుకబడి ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆరో స్థానంలో, నెదర్లాండ్స్ ఏడో స్థానంలో, శ్రీలంక ఎనిమిదో స్థానంలో, ఇంగ్లండ్ తొమ్మిదో స్థానంలో, ఆఫ్ఘనిస్థాన్ పదో స్థానంలో ఉన్నాయి. ఆరో స్థానం నుంచి 10వ స్థానం వరకు ఉన్న జట్లన్నీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచి రెండు పాయింట్లు మాత్రమే సాధించాయి.


దక్షిణాఫ్రికాతో జరిగిన ఘోరమైన, అవమానకరమైన ఓటమి ఇంగ్లాండ్ జట్టుపై చాలా చెడు ప్రభావాన్ని చూపింది. వారి జట్టు పాయింట్ల పట్టికలో ఐదో ర్యాంక్ నుంచి నేరుగా తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఇప్పుడు ఈ ప్రపంచకప్‌లో తదుపరి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రెండు జట్లు ఇప్పుడు తలపడుతున్నాయి. కానీ ఈ రెండు జట్లలో ఒక జట్టు ఓడిపోతుంది.