ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా 3.64 శాతం డీఏ ఇవ్వనున్నట్లు జగన్ సర్కార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం(అక్టోబరు 21న) ఉత్తర్వులు జారీ చేసింది. మూల వేతనంపై 3.64 శాతం మేర డీఏ ప్రకటిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులకు 01.07.2022 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ ఇవ్వనున్నారు. పెరిగిన డీఏతో కలిపి ప్రస్తుత డీఏ రేట్ 26.39 శాతానికి చేరింది.
ఈ ఏడాది నవంబరు జీతంతో పాటు ఈడీఏను నగదుగా చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈనెల వరకు ఉన్న బకాయిలు జీపీఎఫ్ ఖాతాకు 3 విడతల్లో చెల్లిస్తామని తెలిపింది. 2024 ఏప్రిల్, జులై, అక్టోబరులో జీపీఎఫ్ ఖాతాలకు జమచేస్తామని అధికారులు పేర్కొన్నారు. డీఏ బకాయిలు ఇచ్చేసరికి రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్‌తో పాటు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సీపీఎస్ ఉద్యోగులకు 10శాతం ఎరియర్లు మినహాయించి డీఏ చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని అక్టోబరు 20న ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీజీఈఎఫ్) చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి వేర్వేరుగా కలిసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. తాజాగా ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయించడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. డీఏ విడుదల చేయాలని నిర్ణయించినందుకు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు, సీఎస్ జవహర్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ALSO READ:
ఏపీలో ఉద్యోగులకు శుభవార్త - జీపీఎస్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్ అమలు బిల్లుకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడంతో జీపీఎస్ బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం జీపీఎస్ బిల్లు తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం పంపిన జీపీఎస్ బిల్లుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో బేసిక్ శాలరీలో 50 శాతం పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ చట్టం అమలు కానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలోని ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ 'దసరా' కానుక
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అక్టోబరు 21న డీఏ విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ జారీ చేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, గ్రూప్-2లో భారీగా పెరిగిన పోస్టులు
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల నుంచి వచ్చిన అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పోస్టుల సంఖ్యను భారీగా పెంచింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు గ్రూప్-2 పోస్టులకు సంబంధించి అన్ని విభాగాల నుంచి మరోసారి ఖాళీల వివరాలను తెప్పించుకున్న జీఎడీ, పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..