మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. భారీగా అంచనాల నడుమ ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న పలు భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా తొలి షో నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. ‘టైగర్ నాగేశర్వరరావు’ క్యారెక్టర్ కు రవితేజ తన అద్భుత నటనతో నూటికి నూరుశాతం న్యాయం చేశాడనే టాక్ వినిపిస్తోంది. రవితేజ పాత్రను అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. స్టువర్టుపురం గజదొంగ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ‘లియో’, ‘భగవంత్ కేసరి’ లాంటి పెద్ద సినిమాలతో పోటీ పడిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది.
‘టైగర్ నాగేశర్వరరావు’ రన్ టైమ్ కుదింపు
ఇక ఈ సినిమా రన్ టైమ్ కు సంబంధించి మొదటి నుంచి పెద్ద చర్చ జరిగింది. తొలుత ఈ సినిమా రన్ టైమ్ ను చిత్రబృందం 3 గంటలుగా నిర్ణయించింది. అయితే, తొలి షో తర్వాత సినిమా నిడివి మరింత తగ్గించవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొన్ని సీన్లను మరింత క్రిస్ప్ గా మార్చవచ్చు అనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చిత్రబృందం సినిమా నిడివిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ‘టైగర్ నాగేశ్వరరావు’ డ్యురేషన్ మూడు గంటలు ఉండగా, ఇప్పుడు సుమారు అరగంట పాటు తగ్గించింది. 2 గంటల 37 నిమిషాల నిడివితో సరికొత్తగా ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
రవితేజ కెరీర్ లో సరికొత్త రికార్డు
తాజా రన్ టైమ్ తో సినిమా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది. కొన్ని సీన్లు తీసేయడంతో సినిమా మరింత సూటిగా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరికొత్తగా కనిపించాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు కూడా అద్భుతంగా ఉన్నాయంటున్నారు. మొదటిసారి రవితేజ కెరీర్ లో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సరికొత్త రికార్డు సృష్టించింది.
యువ దర్శకుడు వంశీ తెరపైకి తీసుకు వచ్చిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను ఇదే సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పకుడిగా వ్యవహరించారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషించారు.
Read Also: 3 భాగాలుగా ‘మహా భారతం‘- బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన నిర్ణయం
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial