వివేక్ రంజన్ అగ్నిహోత్రి. బాలీవుడ్ సంచలన దర్శకుడు. ఆయన తెరకెక్కించింది తక్కువ సినిమాలే అయినా.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అద్భుత ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఆయన దర్శకత్వంలో మరో ప్రతిష్టాత్మక చిత్రం రూపుదిద్దుకోబోతోంది. భారతీయులు ఎంతో గొప్పగా భావించే మహా భారతాన్ని తెరకెక్కించబోతున్నారు. మూడు భాగాలుగా వెండితెరపై విజువల్ వండర్​గా ఆవిష్కరించబోతున్నారు. ఈ మేరకు వివేక్ అధికారిక ప్రకటన చేశారు.


భైరప్ప పుస్తకం ఆధారంగా తెరకెక్కనున్న మహా భారతం


పద్మభూషణ్ డాక్టర్ ఎస్‌ఎల్ భైరప్ప రచించిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘పర్వ’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వివేక్ తెలిపారు. ఈ సినిమాను ‘పర్వ: యాన్ ఎపిక్ టేల్ ఆఫ్ ధర్మ’ పేరుతో  మూడు భాగాలుగా రూపొందించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథకు సంబంధించి భైరప్పతో వివేక్ చర్చించారు. అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిపల్లవిజోషి నిర్మించనున్నారు. ప్రకాష్ బెలవాడి సహ రచయితగా వ్యవహరించనున్నారు .


ఎన్నో ఏండ్ల పరిశోధనకు రూపం ‘పర్వ’ గ్రంథం


ప్రముఖ పరిశోధకుడు, రచయిత భైరప్ప కొన్ని ఏండ్ల పాటు పరిశోధన చేసి ‘పర్వ’ అనే గ్రంథాన్ని రచించారు. ఈ పుస్తకం పలు భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యింది. ఇంగ్లీష్, చైనీస్, రష్య భాషల్లోనూ రూపొందించారు. అన్ని భాషల్లోనూ ఈ బుక్ బాగా పాపులర్ అయ్యింది. ఈ పుస్తకం ఆధారంగా ఇప్పుడు వివేక్  మహా భారతాన్ని తెరకెక్కించబోతున్నారు.  


‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు


ఇక ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వివేక్‌ అగ్నిహోత్రి . దేశ విభజన సమయంలో కాశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న దారుణ పరిస్థితిని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సంచనల విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత వివేక్ ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా వ్యాక్సీన్ కోసం భారతీయ శాస్త్రవేత్తలు పడ్డ కష్టాన్ని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు వివేక్ అగ్నిహోత్రి.  వాస్తవానికి  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ విజయం తర్వాత, ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించాలని ప్రముఖ నిర్మాణ సంస్థలు తనను సంప్రదించారరని వివేక్ వెల్లడించారు. పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలిపారు. కానీ, వారి ట్రాప్ లో తాను పడలేని చెప్పారు. కరోనా సమయంలో భారతీయ శాస్త్రవేత్తలు పడిన కష్టాన్ని చూపించాలనే ‘ది వ్యాక్సీన్ వార్’ అనే సినిమా చేసినట్లు చెప్పారు. తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించినట్లు ఆయన తెలిపారు.  ఇప్పుడు భారతీయులు తమ ఆత్మగా భావించే మహా భారతాన్ని వెండితెరపై చూపించబోతున్నట్లు వివేక్ వెల్లడించారు.










Read Also: కంగనాను కావాలనే పిలవలేదు, కరణ్ జోహార్​ను ఆట ఆడేసుకుంటున్న నెటిజన్లు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial