అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాబోయే 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించారు. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని పేర్కొన్నారు. అనంతరం వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది. ఈ వాయుగుండం తుపానుగా బలపడొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. 


ఈశాన్య రుతు పవనాల ఆగమనం


మరోవైపు, దేశంలో ఈశాన్య రుతు పవనాల ఆగమనం ప్రారంభమైందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రాంతంతో పాటు కొమోరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో ఈశాన్య గాలులు బలపడి విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈశాన్య రుతు పవనాలు ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే వీటి ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.


రాబోయే 5 రోజులు అలర్ట్


ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షపాతంతో దక్షిణ భారతదేశంలోని చాలా ప్రదేశాల్లో తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25 వరకూ కేరళలో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులోనూ ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 


'తేజ్' తుపాను


అటు, అరేబియా మహా సముద్రంలో తుపాను కొనసాగుతోంది. దీనికి 'తేజ్'గా పేరు పెట్టారు. గత 6 గంటల్లో ఇది నైరుతి అరేబియా సముద్రం మీదుగా తీవ్ర తుఫానుగా మారింది. సోకోత్రా(యెమెన్)కి తూర్పు - ఆగ్నేయంగా 550 కిలోమీటర్లు, సలాలా (ఒమన్)కి 880 కిలోమీటర్ల దక్షిణ-ఆగ్నేయంగా, అల్ గైదా(యెమెన్)కి ఆగ్నేయంగా 930 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 22 ఉదయం వరకు పశ్చిమ - వాయువ్య దిశగా, ఆ తర్వాత 24 ఉదయం వరకు వాయువ్య దిశగా, ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ నెల 25న యెమెన్ - ఒమన్ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.


గుజరాత్ పై ప్రభావం


తేజ్ తుఫాను భారత్‌లోని గుజరాత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుండడంతో రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునని లెక్కగట్టింది. అయితే తీవ్ర తుఫానుగా మారి ఒమన్, దాని పక్కనే ఉన్న యెమెన్ దక్షిణ తీరాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 


Also Read: భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం - 2025 నాటికి పూర్తి చేయాలనేదే లక్ష్యం