Breaking News Live: రష్యాతో చర్చలకు అంగీకరించిన ఉక్రెయిన్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 27 Feb 2022 06:31 PM
రష్యాతో చర్చలకు అంగీకరించిన ఉక్రెయిన్ 

రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించింది. బెలారస్, మాస్కోలో రష్యాతో చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అంగీకరించింది. రష్యన్ స్టేట్ మీడియా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 

మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడిన బాలుడు

మధ్యప్రదేశ్ లో ప్రమాదవశాత్తు బోరుబావిలో బాలుడు పడిపోయాడు. దామోవ్ లో బోరుబావిలో ఏడేళ్ల బాలుడు పడ్డాడు. బాలుడిని రక్షించేందుకు రెస్కూ టీం రంగంలోకి దిగింది.  

బుకారెస్ట్ నుంచి బయలుదేరిన మరో విమానం

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం వేగంగా స్వదేశానికి రప్పిస్తోంది. మూడు విమానాల్లో ఇప్పటివరకు 709 మంది  భారత్‌కు చేరుకున్నారు. బుకారెస్ట్ నుంచి 198 మందితో మరో విమానం బయలుదేరింది. 

Hyderabad: హైదరాబాద్‌లో బాంబు పేలుడు, మహిళ మృతి

హైదరాబాద్‌లోని మైలార్ దేవపల్లిలో బాంబు పేలుడు జరిగింది. ఆనంద్‌ నగర్‌లో ఓ మహిళ చెత్త సేకరిస్తుండగా ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆ మహిళ శరీరం బాగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో సంఘటన ప్రదేశానికి ఆధారాలు సేకరిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రంగముని, సుశీల దంపతులు రోడ్ల ప్రక్కన చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాజేంద్రనగర్, ఆనందనగర్ పారిశ్రామిక వాడలో చెత్త సేకరించేందుకు వెళ్లారు. భర్త రంగముని వేరే స్థలంలో చెత్త సేకరిస్తున్నాడు. సుశీల రాళ్ల మధ్య చెత్తను సేకరిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Charminar: డ్రగ్స్ పై అవగాహన కోసం చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమం

* డ్రగ్స్‌పై యువతలో అవగాహన కల్పించేందుకు చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమం


* పాల్గొన్న హైదరాబాద్ సైక్లింగ్ అసోసియేషన్


* డ్రగ్స్ వీడండి.. సైక్లింగ్ చేయండి అంటూ నినాదాలు


* డ్రగ్స్ మత్తు వదిలేద్దాం.. సైక్లింగ్ తో ఆరోగ్యంగా ఎంజాయ్ చేద్దాం.. అంటూ యువతలో చైతన్యం నింపే ప్రయత్నం


* చార్మినార్ వద్దకు హాజరైన నగరంలో  వివిధ ప్రాంతాలకు చెందిన సైక్లిస్ట్‌లు..

Puvvada Ajay Kumar: పోలియో చుక్కల మందు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

పోలియో మహమ్మారిని శాశ్వతంగా తరిమివేసేందుకు ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారులకు చుక్కల మందు వేయించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరం 40వ డివిజన్ మొనినాన్ ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు ఆయన చుక్కల మందు వేశారు. ప‌ల్స్ పోలియో కోసం జిల్లా వ్యాప్తంగా హెల్త్‌ సెంట‌ర్లు, అంగ‌న్వాడీలు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, లైబ్ర‌రీలు, బ‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. 


పోలియో చుక్కల మందు పంపిణికై జిల్లా వ్యాప్తంగా 1.30లక్షల మంది చిన్నారులు ఉన్నట్లు వైద్య,అరోగ్య శాఖ గుర్తించిందని, వారందరికీ ఆయా చుక్కల మందు పకడ్బందీగా అందించాలని వైద్య శాఖను ఆదేశించారు. రెండు రోజుల పాటు (సోమ‌వారం, మంగ‌ళ‌వారం) సిబ్బంది ఇంటింటికీ తిరిగి, ఇంకా ఎవ‌రైనా టీకా వేసుకోనివారు ఉంటే గుర్తించి పోలియో వ్యాక్సిన్ వేస్తార‌ని వివ‌రించారు. మొత్తం మూడు రోజుల‌పాటు జ‌రిగే ఈ ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్క‌లు వేయాలని ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు వెల్ల‌డించారు. వైద్యారోగ్య‌శాఖ‌తో పాటు ఐసీడీఎస్‌, విద్య‌, పుర‌పాల‌క‌, పంచాయ‌తీ రాజ్ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. 

Mahabubabad: నేడు మహబూబాబాద్‌లో మంత్రుల పర్యటన

మహబూబాబాద్ జిల్లాలో నేడు మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించనున్నారు. కురవి మండలం పెద్ద తండాలో సత్యవతి రాథోడ్‎ను మంత్రులు పరామర్శించనున్నారు. ఇటీవలే రాథోడ్‎ తండ్రి చనిపోయిన సంగతి తెలిసిందే. మంత్రులు పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాక, మంత్రులు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.

Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్‌ చేరిని తెలుగు విద్యార్థులు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. అక్కడికి వెళ్లిన ఎయిరిండియా ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ ప్రత్యేక విమానంలో ఏపీ, తెలంగాణకు చెందిన కొంతమంది తెలుగు విద్యార్థులు మొదటి విడతలో భారత్‌కు చేరుకున్నారు. తెలుగు విద్యార్థులను ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ స్వాగతం పలికారు. వారిని ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పంపారు. దీంతో కాసేపటి క్రితమే విద్యార్థులంతా హైదరాబాద్ చేరుకున్నారు.

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం (Weather Updates) పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ (Hyderabad Weather) కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌, యానం ప్రాంతాల్లో (Andhrapradesh Weather) ప్రధానంగా ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (AP Weather Updates) రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో (AP Weather News) వచ్చే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది.


‘‘రానున్న 10 రోజుల వాతావరణ అంచనాల ప్రకారం.. కోస్తాంధ్ర సహా తెలంగాణలోని ఉత్తర, తూర్పు భాగాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అతి త్వరలో 38 నుంచి 39 డిగ్రీలకు ఎగబాకనుంది. ఇంకొన్ని చోట్ల 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఎలాంటి వర్ష సూచన లేదు. పొగమంచు, చలి పూర్తిగా తగ్గిపోయింది. పగటి పూట వెలుతురు మరింతగా పెరుగుతుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.


తెలంగాణలో ఇలా
హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింతగా పెరగనున్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Weather Updates) వాతావరణం పొడిగా, ఎండగా ఉండే ఆకాశం ఉంటుంది.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు కాస్త తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా పరిణామంతో రెండ్రోజుల క్రితం బంగారం ధర అతి భారీగా ఎగబాకిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రాముకు ఏకంగా రూ.50 చొప్పున తగ్గింది. వెండి కిలోకు రూ.వెయ్యి తగ్గింది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,350 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,570 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.69,000 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,570గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.69,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,350 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,570గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,000 వేలుగా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.