Sub Committee Meeting On Rythu Bharosa: సంక్రాంతి పండుగ తర్వాతే అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే ప్రకటించగా.. దీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సచివాలయంలో రైతు భరోసాపై ఆదివారం సబ్ కమిటీ భేటీ అయ్యింది. కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్కతో (Bhatti Vikramarka) పాటు మంత్రులు, కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. రైతు భరోసా ఇచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందించేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై 2 గంటల పాటు మంత్రులు కసరత్తు చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ రైతు భరోసా అందించిన తీరు.. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపై సుదీర్ఘంగా చర్చించారు.
మరోసారి భేటీ
అయితే, రైతు భరోసా విధి విధానాలపై మరోసారి భేటీ కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది. సాగుభూమికే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకూ అమలు చేయాలనే దానిపై ఓ స్పష్టతకు ఇంకా రానట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి భేటీ అయ్యి చర్చించనుంది. అటు.. ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
భట్టి కీలక వ్యాఖ్యలు
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారమే ముందుకు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 'ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇచ్చి తీరుతాం. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం రూ.72,659 కోట్లు కేటాయించింది. రైతు రుణ మాఫీ కింద 2 నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్ల నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా రైతుల సంక్షేమానికి కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాలని నిర్ణయించాం.
110 రైతు వేదికల్లో రూ.4 కోట్లకు పైగా నిధులు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేశాం. పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తుంది. ఈ ఏడాది లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2023 - 24 ఏడాదికి ఆయిల్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.80.10 కోట్లు విడుదల చేయగా.. రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తంగా రూ.133.5 కోట్లు విడుదల చేశాం. రైతుల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ప్రతి క్వింటాకు రూ.500 బోనస్‌గా ప్రభుత్వం చెల్లిస్తుంది. అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించాం.' అని భట్టి పేర్కొన్నారు.