Sandhya Theater Management Letter To Police: హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede) ఘటనకు సంబంధించి పోలీసులు ఇచ్చిన నోటీసులపై థియేటర్ యాజమాన్యం స్పందించింది. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై 6 పేజీల లేఖను సమాధానంగా పంపింది. థియేటర్‌కు అనుమతులు ఉన్నాయని పేర్కొంది. 'డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది. సినిమాల విడుదలకు గతంలోనూ హీరోలు థియేటర్‌కు వచ్చారు. సంధ్య థియేటర్‌లో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్ ఉంది. గత 45 ఏళ్లుగా థియేటర్‌ను నడుపుతున్నాం. ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు.' అని పేర్కొంది.
అసలేం జరిగిందంటే.?
- ఈ నెల 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- ఆ రోజున అల్లు అర్జున్ రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆయన్ను థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు.
- రేవతి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బన్నీ.. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించారు.
- రేవతి మృతి, తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, సెక్యూరిటీ మేనేజర్ తదితరులపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.
- అనంతరం విచారణ సందర్భంగా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా అదే రోజు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
- ఆ తర్వాత బెయిల్‌పై అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఈ క్రమంలో అసెంబ్లీలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.
- సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు తొక్కిసలాట ఘటనపై విమర్శలు గుప్పించారు. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
- సీఎం వ్యాఖ్యలను బన్నీ ప్రెస్ మీట్ పెట్టి తప్పుపట్టారు. అయితే, పోలీసులు వీడియోలతో సహా ఆధారాలను బయటపెట్టారు. తొక్కిసలాట జరిగిన తర్వాత థియేటర్ నుంచి వెళ్లిపోవాలని బన్నీని కోరినా ఆయన సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పారని పోలీసులు వెల్లడించారు.
- ఈ క్రమంలో పలువురు పోలీస్ అధికారులు సైతం ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. తాజాగా, డీజీపీ జితేందర్ సైతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
- కాగా, బాధిత కుటుంబానికి ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు, అల్లు అరవింద్ రూ.2 కోట్లు, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించారు.