Look Back 2024 Politics | ప్రతి ఐదేళ్లకు ఒక సారి సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెట్ అభ్యర్థులు గెలవడం, ఓడటం జరుగుతుంది. అయితే 2024 ఎన్నికలలో మాత్రం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు కలసి సీట్లను పంచుకుని అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. అంతా సమన్వయంతో పనిచేసి నూతన చరిత్రను లిఖించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో పూర్తిగా ఓడించారు. వార్ వన్ సైడ్ అన్న రీతిలో జిల్లాలోని ఉన్న పార్లమెంట్ స్థానంతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలను సైతం కూటమి గెలుచుకుని వైసీపీకి కూటమి పార్టీలు గట్టి షాక్ ఇచ్చాయి. రాజకీయంగా శ్రీకాకుళం జిల్లాను అవలోకనం చేసుకుంటే 2024 ఎన్నో మైలురాళ్లు గుర్తుండిపోతాయి.
అభ్యర్ధుల ఎంపికపై తర్జనభర్జనలు
శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జనభర్జనలు చోటు చేసుకున్నాయి. అధికార వైసీపీ ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ మాత్రం చివరి వరకూ కొన్ని స్థానాలకి అభ్యర్థులను ప్రకటించకుండా టెన్షన్ పెట్టింది. జనసేన, బిజెపిలతో సీట్లు పంచాయతీ తేలేందుకు సమయం పట్టడంతో 3 పార్టీలలోని ఆశావహులు ఆందోళనకి గురయ్యారు. విడతల వారీగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్థులు ప్రకటించగా మొదటి, రెండవ జాబితాలలో పేర్లు లేని వారు టిక్కెట్ దక్కుతుందో లేదోనని టెన్షన్ కి గురయ్యారు. చివరి వరకూ ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
చంద్రబాబు టిక్కెట్లు ప్రకటించిన తర్వాత కూడా దక్కని వారు నిరసనలకి దిగి వారి పేర్లు ఖరారు చేసుకునేందుకు కూడా యత్నించడం అయోమయానికి గురిచేసింది. ఎవరికి టిక్కెట్ ఖరారవుతుందోనని పార్టీ వర్గాలు, ప్రజలలో కూడా గందరగోళం నెలకొంది. చివరికి కొత్త వారికి అవకాశం ఇస్తూ సీనియర్లను సైతం చంద్రబాబు ప్రక్కన పెట్టిన తీరు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నంతగా రాజకీయ నాటకాలు సాగాయి. అనూహ్య పరిణామాల మధ్య పలాస నుంచి గౌతు శిరీష, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావుల పేర్లను తెదేపా అధిష్టానం ఖరారు చేసింది.
అలాగే ఎచ్చెర్ల కోసం అటు కళా ఇటు కలిశెట్టిలు పోటీపడగా సీట్ల పంపకాలలో అదికాస్తా బిజెపీకి కేటాయించడంతో తెలుగుతమ్ముళ్ళు షాక్ కి గురయ్యారు. ఇదే సందర్భంగా ఎచ్చెర్ల శాసనసభ టిక్కెట్ ఆశించిన కలిశెట్టి అప్పలనాయుడును విజయనగరం పార్లమెంట్ స్థానానికి కళా వెంకటరావును చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానానికి ఎంపిక చేసి ప్రకటించడం కూడా చర్చణీయాంశమైంది. అలాగే ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు కి టిక్కెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ఈ సీట్ల పంచాయతీ చివరి వరకూ సాగడం రాజకీయ వర్గాలలో తర్జనభర్జనలకి గురిచేసింది.
గెలుపుతో మూడు పార్టీలు సంబరాలు
కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు అంతా ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయి వరకూ సమన్వయ సమావేశాలు నిర్వహించాయి. అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని పార్టీ అధినేతలు అభ్యర్థులకు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. అంతా కలసి పనిచేయడంతో కూటమి అభ్యర్థులు అంతా కూడా భారీ మెజార్టీలతో విజయం సాధించారు. శ్రీకాకుళం ఎంపిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకోగా కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి విజయదుందుభి మోగించి చరిత్ర సృష్టించారు. అలాగే పలాస నుంచి గౌతు శిరీష గెలిచి శివంగి అని నిరూపించుకున్నారు.
ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ హ్యాట్రిక్ సాధించి తన సత్తాను మరోసారి చాటుకున్నారు. అలాగే నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి రెండవ సారి ఎమ్మెల్యే అయ్యారు. పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్లల నుంచి తొలిసారి బరిలోకిదిగిన మామిడి గోవిందరావు, గొండు శంకర్, ఎన్.ఈశ్వరరావులు భారీ మెజార్టీలతో గెలిచి రికార్డ్ నెలకొల్పారు. ఆమదాలవలస కోటలో కూన రవికుమార్ మరోసారి పాగా వేసారు. విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి శ్రీకాకుళం జిల్లాకి చెందిన టీడీపీ యువనేత కలిశెట్టి అప్పలనాయుడు భారీ విజయంతో గెలుపొంది చరిత్ర నమోదుచేశారు. ఊహించని విధంగా కూటమి అభ్యర్థులు అంతా భారీ స్థాయిలో మెజార్టీలు సాధించడం ద్వారా సంచలనం సృష్టించారు.
బాబాయ్, అబ్బాయిలకు రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులు
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. టెక్కలి నుంచి మరోసారి గెలిచిన అచ్చెన్నాయుడుకి రాష్ట్ర మంత్రిగా అవకాశం లభించింది. ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్ అబ్బాయ్ లకి అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను మంత్రి పదవులు దక్కడం శుభపరిణామం. ఇక ఇచ్చాపురం నుంచి వరుసగా మూడవ సారి గెలిచి రికార్డ్ సృష్టించిన బెందాళం అశోక్ కి శాసనసభ విప్ పదవి దక్కింది. అంతేకాదు కూటమి పార్టీలో అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపునిస్తూ నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు. కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా పనిచేసే నాయకులకి అవకాశం కల్పించారు.
వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ
వైసీపీకి 2024లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత జిల్లాలో ఊహించని ఫలితాలను చవిచూసింది. 2014లో ఏజెన్సీ ప్రాంతాలలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అప్పట్లో అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్ష శాసనసభ్యులుగా పార్టీకి చెందిన నేతలు ఉండేవారు. 2019లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 8 స్థానాలలో వైకాపా శాసనసభ్యులు గెలవగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలను టీడీపీ అప్పుడు గెలుచుకుంది. ఈ ఏడాది ఎన్నికలలో మాత్రం వైసీపీ ఒక్కశాసనసభ స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా విజయం సాధించకపోవడం వారికి గొప్ప షాక్. కూటమి పార్టీ అభ్యర్థుల జోరు ముందు వైకాపా అభ్యర్ధులు నిలవలేక ఓటమి చవిచూసారు. ఊహించని ఈ ఫలితాలు వైకాపా శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి.