Numaish Started From 3rd January In Hyderabad: భాగ్యనగరంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్‌కు (అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల) సర్వం సిద్ధమవుతోంది. అయితే, 84వ నుమాయిష్ (Numaish) ఎగ్జిబిషన్ జనవరి 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా వాయిదా పడింది. జనవరి 2 వరకూ ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించిందని.. వచ్చే నెల 3న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకూ దాదాపు 46 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ఎగ్జిబిషన్‌లో 2 వేలకు పైగా స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 100 సీసీ కెమెరాలు, సెక్యూరిటీ, వాలంటీర్స్‌తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


1938లో నిజాం కాలంలో మొదలైన నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి సందర్శకులు తరలివస్తారు. వీరి సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ.. గాంధీభవన్, అజంతా, గోషామహల్ గేట్లను అందుబాటులో ఉంచింది. సందర్శకులు మైదానాల్లో తిరిగేందుకు రోడ్లను ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్ డ్రై ఫ్రూట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి హస్తకళ వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. అలాగే, దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అన్ని రకాల స్టాల్స్ సైతం అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఎగ్జిబిషన్‌కు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 వరకూ టికెట్లు అందుబాటులో ఉంటాయి.


Also Read: Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ