Actor Ramcharan Big Cutout Launched In Vijayawada: ప్రముఖ దర్శకుడు శంకర్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) కాంబోలో వస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer). సంక్రాంతి బరిలో జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సందర్భంగా విజయవాడలో భారీ కటౌట్‌ను ఆయన అభిమానులు సిద్ధం చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రామ్‌చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో నగరంలోని బృందావన కాలనీ వజ్ర మైదానంలో ఏర్పాటు చేసిన 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్‌ను ఆదివారం సాయంత్రం చిత్ర నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. అనంతరం హెలికాఫ్టర్ ద్వారా కటౌట్‌పై పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి గేమ్ ఛేంజర్ చిత్ర బృందం సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 


ప్రపంచ రికార్డు..


ఈ భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ అవార్డును సంస్థ ప్రతినిధుల నుంచి చిత్ర నిర్మాత దిల్ రాజు అందుకున్నారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారని.. ఇది తమకెంతో ప్రత్యేకమని అభిమానులు చెబుతున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దీని నిర్మాణంలో భాగమైందని.. దాదాపు వారం రోజుల పాటు శ్రమించి దీన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకున్నాయి. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. కియారా అద్వాణీ కథానాయిక కాగా ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, ప్రకాశ్‌రాజ్, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'గేమ్ ఛేంజర్' విడుదల కానుంది.


ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై..


మరోవైపు, 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. సినిమా ట్రైలర్ తన ఫోన్‌లో ఉందని.. అది చూపించాలంటే ఇంకా వర్క్ చేయాల్సి ఉందని చెప్పారు. 'ట్రైలరే సినిమా రేంజ్ నిర్ణయిస్తుంది. జనవరి 1వ తేదీన ట్రైలర్ విడుదలవుతుంది. తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ. 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ పెట్టడంతో ఈ నగరంలో మరో రికార్డు నెలకొంది. మెగా అభిమానులందరికీ ధన్యవాదాలు. సుప్రీం హీరో చిరంజీవితో మొదలైన మీ అభిమానం వారి కుటుంబంపై కొనసాగుతోంది. ఈవెంట్‌తో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసేందుకు ఇక్కడకు వచ్చాను. ఆయన చెప్పే డేట్ ప్రకారం ఈవెంట్ ఎక్కడ చేయాలో నిర్ణయిస్తాం. మనం ఆ ఈవెంట్‌తో చరిత్ర సృష్టించాలి. మీరంతా జనవరి 10న రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు. ఐఏఎస్ అధికారి, కొంతసేపు పోలీస్ ఆఫీసర్‌గా ఆయన అలరిస్తారు. సినిమాలోని 5 పాటలు దేనికదే ప్రత్యేకం. రన్ టైమ్ గురించి శంకర్‌కు ముందే చెప్పగా.. అన్ని హంగులు జోడిస్తూ 2 గంటల 45 నిమిషాల్లో ఆయన చక్కగా తీర్చిదిద్దారు.' అని పేర్కొన్నారు.


Also Read: Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలయ్యతో స్టెప్పులేసిన ఊర్వశి... లుక్కు చూశారా? సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?