దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 2 కోట్ల 60 లక్షల దళిత బంధు ఆస్తులు మంత్రి పంపిణీ చేశారు. తెలంగాణలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు అభివృద్ది చెందుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం వద్ద తెలంగాణ దళిత బంధు ఆస్తులను మంత్రి గంగుల శుక్రవారం పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిన్న డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేసిన వారు నేడు దళిత బంధు పథకం ద్వారా యజమానులుగా మారడం అభినందనీయమని అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేసిన ఘనత కేసీఆర్‌కు సొంతం అన్నారు.
దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ నాయకత్వంపై మరింత నమ్మకం ఏర్పడిందని అన్నారు. 24 మంది లబ్దిదారులకు 10 యూనిట్లుగా, 6 హర్వెస్టర్లు, 3 జేసిబిలు, 1 డీసీఎం వ్యాన్ లు మంత్రి గంగుల పంపిణీ చేశారు. ఒక్కో హర్వెస్టర్ రూ. 22 లక్షలు, ఒక్కో జేసీబీ రూ. 34 లక్షలు, డీసీఎం వ్యాన్ రూ. 24 లక్షలు కాగా మొత్తంగా 2 కోట్ల 60 లక్షల విలువ చేసే వాహనాలను లబ్దిదారులకు అందించామని మంత్రి వెల్లడించారు.
దళిత బంధు పథకం ద్వారా లబ్దిపొందేందుకు ముగ్గురు లేదా నలుగురు కలిసి బృందంగా ఏర్పడి హార్వెస్టర్లు, జేసీబీలు, డీసీఎం వ్యాన్ ఎంపిక చేసుకున్నారని తెలిపారు. వీటితో లబ్దిదారులు ఆర్థికాభివృద్ది సాధిస్తారని మంత్రి గంగుల ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన లబ్దిదారులు స్వయం ఉపాధిగా లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ హార్వేస్టర్లు నడిపి ఆకట్టుకున్నారు.
Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు