NIT Student Suicide: కరోనా వైరస్ మహమ్మారి ప్రత్యక్షంగా కొందరు విద్యార్థుల్ని బలిగొంది. పరోక్షంగానూ కొందరు విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు కారణమవుతోంది. ఆన్‌లైన్ క్లాసులతో కెరీర్ ఎలా ఉంటుందో తెలియక కొందరు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు బలవన్మరణం చెందుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జంగారెడ్డిగూడెనికి చెందిన ఆదూరి శ్రీనివాస్ మైసన్నగూడెం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేస్తున్నారు. శ్రీనివాస్, అరుణ దంపతుల కుమారుడు ఆదూరి ప్రమోద్‌కుమార్(20) తెలంగాణ, వరంగల్ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం ఈఈఈ చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుండే వాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండేళ్లుగా ఇంటి నుంచే ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు. రెండేళ్లుగా ఇంటికే పరిమితం కావడం, ఆన్‌లైన్ క్లాసులు, మెయిల్స్, రికార్డులు పూర్తి చేయడం జరుగుతోంది. ఆన్‌లైన్ క్లాసులు, జీవితం యాంత్రికంగా మారిపోయిందంటూ ఒత్తిడికి గురైన బీటెక్ స్టూడెండ్ ప్రమోద్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.
ఇంట్లో తన గదిలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ప్రమోద్. కుమారుడి గది తలుపులు తెరిచి చూసిన తల్లి అరుణ షాకయ్యారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి తమను సంతోషంగా చూసుకుంటాడని భావించిన కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నీకు ఏం కష్టం వచ్చింది కన్నా అంటూ కుమారుడి మృతదేహంపై పడి తల్లి అరుణ రోదించడం స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. విద్యార్థి ప్రమోద్ తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
కరోనా వల్ల ఎన్‌ఐటీ తెరవడం లేదని, రెండేళ్లు ఇంటికి పరిమితం కావడం, ఆన్‌లైన్‌లోనే క్లాసులు, చదువు కావడంతో ఒత్తిడికి గురయ్యాడు. వీటితో పలు మరికొన్ని విషయాలు తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాసి ప్రమోద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల జరిగిన ప్రాజెక్టు వర్క్‌లోనూ ‘ఏప్లస్’ గ్రేడ్ సాధించిన కుమారుడు అనూహ్యంగా బలవన్మరణం చెందడాన్ని తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. త్వరలో జరగనున్న గేట్ పరీక్షలకు సైతం బాగా ప్రిపేర్ అయ్యాడని చెబుతూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు