బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు పార్టీ జాతీయ అధిష్ఠానం కూడా పూర్తి మద్దతు పలికింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సమీపంలో మంగళవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీని బీజేపీ నిర్వహించ తలపెట్టింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఆయన ఢిల్లీ నుంచి సాయంత్రానికి హైదరాబాద్ రానున్నారు. అయితే, తాజాగా హైదరాబాద్ పోలీసులు ఆయనకు షాక్ ఇచ్చారు. జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పేశారు.
జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని స్వయంగా నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని డీసీపీ చందన స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు ఈ నెల 10వ తేదీ వరకు తెలంగాణలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలకు తావు లేదని, జేపీ నడ్డా పాల్గొనే క్యాండిల్ ర్యాలీని కూడా అడ్డుకుంటామని ఆమె తెలిపారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం ర్యాలీ నిర్వహించి తీరతామని గట్టిగా చెబుతున్నారు. దీంతో జేపీ నడ్డా ర్యాలీ నిర్వహణపై ఉత్కంఠ నెలకొని ఉంది.
అందుకే బండి సంజయ్ అరెస్టు
రెండు రోజుల క్రితం జీవో నెంబరు 371కి వ్యతిరేకంగా బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. అయినా ఆయన కరీంనగర్‌లో దీక్షకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గేట్లను కట్ చేసి మరీ లోపలికి ప్రవేశించి బలవంతంగా బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. ఆయనపై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు పెట్టి కోర్టులో హాజరు పర్చారు. అంతకుముందే బెయిల్ కోసం బండి సంజయ్ అభ్యర్థించగా.. ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు.
కేసీఆర్ ప్రభుత్వంపై జేపీ నడ్డా ఫైర్
బండి సంజయ్ అరెస్టు వ్యవహారంపై జేపీ నడ్డా ఢిల్లీలో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై పోలీసులు హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా టీచర్లు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ సంజయ్ కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ దీక్ష చేపట్టారని అన్నారు. శాంతియుతంగా చేస్తున్న ఈ దీక్షను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడిందని, అందుకే ఈ దీక్షపై దాడి చేసిందని ఆరోపించారు. ‘వినాశకాలే విపరీతబుద్ధి’అన్న చందంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని అనడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు ఇంకో ఉదాహరణ అని నడ్డా విమర్శించారు.
Also Read: Nellore Crime: ప్రేమతో కూర వండిన భార్య.. మొహం చిట్లించిన భర్త, ఆవేశంతో ఘోరానికి పాల్పడ్డ భార్య
Also Read: TS High Court: తెలంగాణ హైకోర్టులో కొవిడ్, ఒమిక్రాన్‌పై విచారణ.. నివేదిక సమర్పించిన డీజీపీ, డీహెచ్
Also Read: రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్... !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి