కరీంనగర్‌‌లో 2018లో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను కరీంనగర్ న్యాయస్థానం ఖరారు చేసింది. కాటారం మండలం శంకరపల్లి చెందిన వంశీధర్ 2018లో గోదావరి ఖనికి చెందిన  రసజ్ఞ అనే యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. అయితే అప్పటికే తన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని అతను ఇబ్బంది పెడుతున్నాడని తన కుటుంబ సభ్యులకు బాధితురాలు తెలిపింది. కానీ తర్వాత గొడవ జరగడంతో అతనికి దూరంగా ఉంటూ వస్తోంది. ఇది మనసులో పెట్టుకున్న వంశీధర్ ఆకస్మికంగా ఆమె పనిచేస్తున్న మీ - సేవ సెంటర్‌లో పట్టపగలే దాడిచేసి హతమార్చాడు. అప్రమత్తమైన చుట్టుపక్కల జనాలు అతనిని చితకబాది పోలీసులకు అప్పగించారు.


పోలీసు కమిషనరేట్, కలెక్టరేట్ లాంటి కీలక ప్రాంతాలకు సమీపంలోనే దారుణ హత్య జరగడంతో వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు. మూడేళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు సోమవారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందని యువతి సోదరుడు దీపక్ హర్షం వ్యక్తం చేశారు.


బాధితురాలి తల్లి ఉట్ల విజయ మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తె మరణానికి కారణమైన దోషికి శిక్ష పడడం.. తమకు న్యాయం జరిగినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. కేసు నమోదైన నాటి నుంచి నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.


2018లో జరిగిన ఈ హత్య కేసు అప్పట్లో సంచలనం రేపింది. మీ - సేవ సెంటర్‌లో పని చేసే యువతిపై పట్టపగలే దాడి చేసి నిందితుడు హతమార్చాడు. దీంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. అన్ని పత్రికల్లో, మీడియాలో ప్రముఖంగా ఈ హత్యా ఘటన గురించే ప్రచురితం అయింది. తాజాగా మూడేళ్లకు ఈ కేసులో తుది తీర్పు వెలువడి.. నిందితుడిని దోషిగా తేల్చి, యావజ్జీవ కారాశిక్ష విధించడంతో బాధిత కుటుంబం, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Nellore Crime: ప్రేమతో కూర వండిన భార్య.. మొహం చిట్లించిన భర్త, ఆవేశంతో ఘోరానికి పాల్పడ్డ భార్య


Also Read: Kottagudem: దంపతుల సజీవదహనంతో సంబంధం లేదు... వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే కుమారుడు


Also Read: పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారణం ఆ ఎమ్మెల్యే కొడుకు ! వెదుకుతున్నపోలీసులు...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి