- నంద్యాల వైసీపీలో భగ్గుమంటున్న విభేదాలు
- వర్గాలుగా విడిపోయిన వైసీపీ సీనియర్ నాయకులు
కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో అలకలు మొదలయ్యాయి. వైసీపీ సీనియర్ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని గ్రూపులు తయారు చేశారు. అయితే ఆ నేతలను బుజ్జగించడంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విఫలమయ్యారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
అయితే గత 22 సంవత్సరాలుగా శిల్పా వర్గాన్ని నమ్ముకుని, వారి గెలుపునకు చేదోడువాదోడుగా, న్యాయపరంగా, పార్టీకి సూచనలు, సలహాలు ఇస్తూ తన భుజస్కంధాలపై నంద్యాల మండలం మరియు నంద్యాల పట్టణంలోని కొన్ని వార్డులను గెలిపిస్తున్న నేత వైసీపీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి మాజీ సర్పంచ్ తులసి రెడ్డి బహిరంగంగానే శిల్పా ఫ్యామిలీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రముఖ సీనియర్ న్యాయవాది తులసి రెడ్డి మాట్లాడుతూ.. గత 22 ఏళ్లుగా శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో నంది రైతు సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగడానికి అన్ని విధాలుగా శాయశక్తులుగా ఆయన గెలుపునకు కృషి చేశానని చెప్పారు. కానీ తనకు మాత్రం ఏ విషయంలోనూ ప్రాధాన్యత ఇవ్వకుండా స్థానికులను రాజకీయంగా ఎదగకుండా అణచి వేస్తున్నారని మండిపడ్డారు. మొదట్నుంచీ పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి తగిన గౌరవం దక్కడం లేదన్నారు.
శిల్పా మోహన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డిలు ఇద్దరు కూడా విషం కంటే చాలా ప్రమాదకర వ్యక్తులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో స్థానిక నేతలంతా ఒక కూటమిగా ఏర్పడి పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వీరితో పాటు గుర్తింపు దక్కని మరికొందరు కూడా వైసీపీని వీడి.. పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: Weather Updates: అక్కడ మరో రెండు రోజులపాటు వర్షాలు.. ఏపీ, తెలంగాణలో తగ్గిన చలి తీవ్రత