తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో భాగంగా పలు ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు,  ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమై.. కరోనా పరిస్థితులపై చర్చించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు.


ఈ సమావేశంలో లాక్ డౌన్ గురించి అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. లాక్ డౌన్ అక్కర్లేదని అధికారులు చెప్పారని సీఎం అన్నారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆస్పత్రుల్లో పడకలు, పరీక్ష కిట్లు, మందులు సమకూర్చుకోవాలని చెప్పారు. బస్తీ దవాఖానాలపై ఏర్పాటుపైనా.. పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని.. మాస్కులు తప్పకుండా ధరించాలని సీఎం అన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా సీఎం కేసీఆర్ కు అధికారులు నివేదిక ఇచ్చారు. గుంపులుగా ఉండరాదని నివేదికలో పేర్కొన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.


పిల్లల టీకా ప్రారంభం


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు కరోనా టీకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పిల్లలకు టీకా ఇచ్చేందుకు అనుమతి ఉందని అన్నారు. 12 కార్పొరేషన్‌లలో ఆన్‌లైన్, ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్ధతిలో టీకాలు ఇస్తున్నామని తెలిపారు. నాలుగు రోజుల తర్వాత పరిస్థితుల ఆధారంగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌పై మరోసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కాలేజీ ఐడీ కార్డ్ ఉన్నా రిజిస్ట్రేషన్‌కు సరిపోతుందని మంత్రి తెలిపారు.


పిల్లల విషయంలో కరోనా టీకాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. వ్యాక్సిన్‌ తీసుకుంటే పిల్లలకు రక్షణ కవచంలా పని చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున.. గత వారంలో పాజిటివిటీ రేటు నాలుగు రెట్లు పెరిగిందని మంత్రి చెప్పారు. కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని.. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా కరోనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా పూర్తి సిద్ధంగా ఉందని హరీశ్ రావు అన్నారు.


Also Read: పిల్లలకి వ్యాక్సిన్‌ బాధ్యత పేరెంట్స్‌దే.. ప్రస్తుతం వీరికి మాత్రమే టీకాలు.. హరీశ్‌ రావు వెల్లడి


Also Read: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. మీరు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేస్కోండి


Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. ఇప్పటి నుంచి నో బయోమెట్రిక్.. ఎప్పటి వరకు అంటే