తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. పిల్లలకు వ్యాక్సిన్లు వేయించే బాధ్యత తల్లిదండ్రులదే అని హరీశ్ రావు అన్నారు. పిల్లలకు టీకా వేయించేందుకు కళాశాలలు యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు. ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే టీకాలు వేస్తున్నారని చెప్పారు. పిల్లలకు వ్యాక్సిన్ సందర్భంగా హరీశ్ రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అర్హులైన పిల్లలందరికీ కోవాగ్జిన్ టీకా ఇస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు కరోనా టీకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పిల్లలకు టీకా ఇచ్చేందుకు అనుమతి ఉందని అన్నారు. 12 కార్పొరేషన్‌లలో ఆన్‌లైన్, ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్ధతిలో టీకాలు ఇస్తున్నామని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత పరిస్థితుల ఆధారంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌పై మరోసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కాలేజీ ఐడీ కార్డ్ ఉన్నా రిజిస్ట్రేషన్‌కు సరిపోతుందని మంత్రి తెలిపారు.
Also Read: COVID Vaccine: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. మీరు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేస్కోండి
పిల్లల విషయంలో కరోనా టీకాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలకు రక్షణ కవచంలా పని చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున.. గత వారంలో పాజిటివిటీ రేటు నాలుగు రెట్లు పెరిగిందని మంత్రి చెప్పారు. కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని.. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా కరోనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా పూర్తి సిద్ధంగా ఉందని హరీశ్ రావు అన్నారు.
సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై కమిటీ ఏర్పాటు: హరీశ్ రావు
సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ర్యాగింగ్ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ ఘటనపై కమిటీని ఏర్పాటు చేశామని, ఈరోజు మధ్యాహ్నానికి నివేదిక వస్తుందని చెప్పారు. నివేదిక రాగానే కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు చెప్పారు.
Also Read: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. శివపార్వతి థియేటర్ పూర్తిగా దగ్ధం.. భారీ ఆస్తి నష్టం
Also Read: Vijayawada: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు : విజయవాడ సీపీ