హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గం పెంచికల్ పేటలో ఎన్నికల ప్రచారంలో మంగళవారం మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థికి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. గ్యాస్ సిలిండర్ ధరలో రూ.291 రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. రుజువు చేయలేకపోతే ఎన్నికల నుంచి రాజేందర్ తప్పుకుంటారా అని సవాల్ చేశారు. ప్లేస్, టైం డిసైడ్ చేయాలన్నారు. సిలిండర్ ధరలపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈటల రాజేందర్ కు అధికారంలో ఉన్నప్పుడు పేదలు కనిపించలేదన్నారు.
Also Read: హుజురాబాద్‌లో 61 మంది నామినేషన్లు ... ప్రధాన పార్టీల మధ్యే పోరు
5 శాతం జీఎస్టీ మాత్రమే
గ్యాస్ ధర తగ్గాలంటే రాష్ట్రం పన్నులు తగ్గించుకోవాలని ఈటల అంటున్నారన్న మంత్రి హరీశ్... కానీ రాష్ట్రప్రభుత్వం తరపున ఒక్క రూపాయి ట్యాక్స్ వేయడంలేదన్నారు. జీఎస్టీ పన్ను 5 శాతం మాత్రమే రాష్ట్ర వాటా ఉందన్నారు. అది కూడా రూ.47 రూపాయలు మాత్రమే అన్నారు. తాను 20 ఏళ్లు ఉద్యమంలో పోరాడానని మంత్రి హరీశ్ అన్నారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టాక గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్‌తో పాటు సర్టిఫికెట్స్ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వంపై అక్కసుతో కొందరు కోర్టుకు వెళ్లడంతో అది నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యిందన్నారు. కరీంనగర్ లో గ్రామీణ వైద్యులకు సమస్యలు వస్తే కొప్పుల ఈశ్వర్ వారి పక్షాన పోరాడారని గుర్తుచేశారు. సిద్దిపేటలో 15 ఏళ్ల కిందటే గ్రామీణ వైద్యులకు మంచి భవనం నిర్మించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Also Read: హుజురాబాద్ బలిపశువు హరీష్ రావే .. టీఆర్ఎస్ -బీజేపీ కలిసే రాజకీయం చేస్తున్నాయంటున్న రేవంత్
ఆటో ప్రమాదాన్ని టీఆర్ఎస్ పై రుద్దే ప్రయత్నం
ఈటల ఆరుసార్లు గెలిచి హుజూరాబాద్ లో ఒక్క భవనాన్ని కూడా నిర్మించలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తమ్ముడిలా చేరదీసిన కేసీఆర్ కు ఘోరీ కడుతానంటున్న ఈటల నీతినిజాయితీ ఉందా అని ప్రశ్నించారు. బీసీల బిడ్డనని చెప్పుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ పథకాలను విమర్శించిన మంత్రి ఈటల అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ గెలిస్తేనే హుజూరాబాద్ లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని హరీశ్‌రావు అన్నారు. ఈ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే అభివృద్ధి పనుల్ని దగ్గర నుండి మరీ పూర్తిచేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఆటో ఆక్సిడెంట్ జరిగితే దానిని టీఆర్ఎస్ మీద రుద్దే ప్రయత్నం చేశారన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి బండి సంజయ్ సన్నిహితుడని హరీశ్‌రావు ఆరోపణ చేశారు.
Also Read: హుజూరాబాద్ లో ఉత్కంఠ... ఈటల రాజేందర్ పై కేసు నమోదు... బరిలో నలుగురు ఈ రాజేందర్ లు