హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితం అంతిమంగా హరీష్‌రావును సైడ్ చేయడానికేనని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి విశ్లేషించారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి బలమూరు వెంకట్ నామినేషన్ వేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున చురుకుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటేనని చెబుతున్నారు. కేంద్రంతో పోరాటం చేస్తామని కేసీఆర్ చెబుతున్న మాటలన్నీ శుద్ద తప్పు అని రేవంత్ రెడ్డి తేల్చేశారు.
Also Read : కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వరా? అసెంబ్లీలో చర్చ.. కేసీఆర్ స్పష్టత, ఆసక్తికర వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న కారణంగా మజ్లిస్‌తో అక్కడ పోటీ చేయించి రాజకీయంగా ఉపయోగించుకునే లక్ష్యంతోనే అమిత్ షా, నరేంద్రమోడీ కేసీఆర్‌ను దగ్గరకు తీస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా పెట్టలేదని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఏర్పాట్లను కేసీఆరే చేశారన్నారు. రెండు పార్టీలు ఒక్కటేనని.. స్పష్టం చేశారు.
Also Read: "మా"కు మోడీకి ఏంటి సంబంధం ? "అతి" స్థాయికి చేరిన తారల ఎన్నికల రగడ !
హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా అసలు బకరా మాత్రం మంత్రి హరీష్ రావేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు వ్యూహాత్మకంగా హరీష్ రావును పక్కకు తప్పిస్తున్నారని టీ పీసీసీ చీఫ్ చెబుతున్నారు. అటు కేసీఆర్.. ఇటు కిషన్ రెడ్డిలు తమకు అనుకూలంగా ఎన్నికల ఫలితం ఉండేలా చూసుకోవాలని అనుకుంటున్నారని విశ్లేషించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే హరీష్ రావును బాధ్యుడ్ని చేస్తారని రేవంత్ అభిప్రాయం. అలాగే కిషన్ రెడ్డికి బండి సంజయ్ పార్టీలో ప్రధాన పోటీదారుగా ఎదిగారని.. ఈటల గెలిస్తే ఆయన క్రేజ్ మరింత పెరుగుతుందన్నారు. అందుకే రెండు పార్టీలు కలిసి తెర వెనుక రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్ చెబుతున్నారు.
Also Read: తెలుగు అకాడమీ స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ.. సీసీఎస్ విచారణలో షాకింగ్ విషయాలు!
టీఆర్ఎస్, బీజేపీ రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్న విషయాన్ని హుజురాబాద్ ప్రజల ముందు ఉంచుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న బలమూరు వెంకట్ కోసం వీలైనన్ని ఎక్కువ రోజులు ప్రచారం చేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
Also Read : అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. కేటీఆర్‌ను కలిసిన రఘునందన్, ఏం మాట్లాడుకున్నారంటే..