తెలంగాణలో కౌలు రైతుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వారి విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందనే విషయంపై సీఎం స్పష్టత ఇచ్చారు. శుక్రవారం నాటి తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొన్ని ప్రశ్నలు వేశారు. వర్షాల కారణంగా చాలా చోట్ల పంటలు దెబ్బ తిన్నాయని, మంథని, మధిర నియోజకవర్గాల్లో వరదల కారణంగా పంటలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 52 శాతం కౌలు రైతులు ఉన్నారని, వారికి రైతుబంధు అందడం లేదని వివరించారు. వారికి కనీసం నష్ట పరిహారమైనా ఇప్పించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.


Also Read: "మా"కు మోడీకి ఏంటి సంబంధం ? "అతి" స్థాయికి చేరిన తారల ఎన్నికల రగడ !


ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన అభిప్రాయం ఉందని అన్నారు. కౌలు రైతుల‌ గురించి ప‌ట్టించుకుంటే అస‌లు రైతుల‌కే మోసం వ‌స్తుందని సీఎం అన్నారు.‘‘తెలంగాణ‌లో భూముల పార‌ద‌ర్శక‌త కోసం ధ‌ర‌ణి పోర్టల్ తీసుకొచ్చాం. దీని ద్వారా రైతుల‌కు చాలా మేలు జరిగింది. ధ‌ర‌ణి పోర్టల్‌లో ల‌క్షలాది రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతున్నాయి. ఏళ్ల తరబడి సొంత భూమిని కాపాడుకుంటూ వస్తున్న రైతును.. కౌలు రైతు పేరు మీద బ‌లిచేయ‌ద‌లుచుకోలేదు. ధ‌ర‌ణి పోర్టల్‌లో ఆ కాలమ్స్ తొల‌గించాం. కౌలు అనేది పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. అది భూమి సొంత రైతు, కౌలు రైతుకు మ‌ధ్య ఉన్న ఒప్పందం మాత్రమే’’


‘‘ఇలాంటి సందర్భంలో కౌలు రైతు మారినప్పుడ‌ల్లా ధరణి పోర్టల్‌లో ప్రభుత్వం సంబంధిత రికార్డుల‌ను కూడా మార్చడం సాధ్యం కాదు. రైతు, కౌలు రౌతు మధ్య జరిగే ఒప్పందం ప్రభుత్వ ప‌ని కాదు. కౌలు రైతుల విష‌యాన్ని మేం ప‌ట్టించుకోబోం. అలా అని.. కౌలు రైతుల ప‌ట్ల మాకు మాన‌వీయ‌త ఉంది. కానీ అస‌లు రైతు న‌ష్టపోవద్దు అనేది మా ఉద్దేశం. అస‌లు రైతులు త‌మ భూముల‌ను వార‌స‌త్వంగా కాపాడుకుంటున్నారు. అస‌లు రైతుల‌కు క‌ష్టాలు వ‌స్తే ఉప‌వాస‌మైనా ఉంటారు కానీ.. భూముల‌ను అమ్ముకోరు. అలా కాపాడుకున్న భూమిని కొంద‌రు పైర‌వీకారుల వ‌ల్ల గ‌ద్దల్లా త‌న్నుకుపోయే ప‌రిస్థితి ఉండొద్దని, రైతుల సంక్షేమం దృష్ట్యా కౌలు రైతుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.’’


Also Read: తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో రంగంలోకి ఈడీ.. సీసీఎస్ విచారణలో షాకింగ్ విషయాలు!


‘‘ఒక వేళ కౌలు రైతులు న‌ష్టపోతే.. త‌ప్పకుండా వారిని ప్రభుత్వం మాన‌వీయ కోణంలో కచ్చితంగా ఆదుకుంటుంది. కౌలు రైతులు, గిరిజ‌న రైతులు న‌ష్టపోతే.. వందో, రెండు వంద‌ల కోట్లో ఇచ్చి ఆదుకోలేనంత దుస్థితిలో అయితే తెలంగాణ ప్రభుత్వం లేద‌ు. కౌలు రైతుల‌కు ప్రభుత్వం న్యాయం చేస్తుంది.’’ అని కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించారు.


Also Read: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాడు పని.. చైల్డ్ పోర్న్ వీడియోలతో రహస్య దందా.. పోలీసులు ఇలా కనిపెట్టేశారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి