గురువారం నాటి తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్-బీజేపీ నేతలు ఎప్పుడూ నీరు నిప్పుల్లాగా విమర్శలు చేసుకుంటూ ఉండే సంగతి తెలిసిందే. అందులోనూ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు కూడా ఘాటుగానే ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యంగా ఆయన ఎన్నో సందర్భాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రఘునందన్ రావు మంత్రి కేటీఆర్‌ను కలిసి కొంత సేపు మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.


గురువారం నాడు అసెంబ్లీలో ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. స్టాంపు డ్యూటీ సవరణ బిల్లు ఆమోదం పొందే సమయంలో రఘునందన్ రావు తాను కూర్చున్న స్థలం నుంచి మంత్రి కేటీఆర్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లారు. కేటీఆర్‌కు ఒక స్పైరల్‌ బైండింగ్‌ చేసిన ఫైలును అందించారు. ఆ తర్వాత కొంత సేపు అక్కడే ఉండి మాట్లాడారు. ఆ తర్వాత అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ రఘునందన్‌ రావు సంభాషించి వెనక్కు వచ్చారు.


Also Read: ఈటలకు కేసులు - భార్యకు ఆస్తులు ఎక్కువ ! ఆఫిడవిట్‌లో ఆశ్చర్యపరిచే విషయాలు ...!


మరోవైపు, సభలో రఘునందన్ రావు భూ సమస్యలపై మాట్లాడుతూ.. రైతుల దగ్గర నుంచి భూసేకరణ అంతా పూర్తయ్యాక ధరలు పెంచుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి రెండేళ్లకోసారి భూముల ప్రభుత్వ రేట్ల సవరణ చేసి ఉండి ఉంటే వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు ఎక్కువ డబ్బులు వచ్చేవని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు భూ సేకరణ అంతా పూర్తయ్యాక ధరలు పెంచుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆ క్లాజ్ పెట్టాలని రఘునందన్ కోరారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.


Also Read : సమస్యలు పరిష్కరించకపోతే పోరు బాట.. ఏపీ ప్రభుత్వానికి రెండు ఉద్యోగ సంఘాల హెచ్చరిక !


బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే..
హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ తమ స్టార్ క్యాంపైనర్ల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 20 మంది నాయకులకు చోటు కల్పించింది. వారిలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, తరుణ్ చుగ్, కే.లక్ష్మణ్, మురళీధర్ రావు, చాడ సురేష్ రెడ్డి, రమేశ్ రాథోడ్, యెండల లక్ష్మీ నారాయణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, కూన శ్రీశైలం గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు.


Also Read: అత్యాచారంతో బాలికకు గర్భం.. పిండం తొలగింపునకు హైకోర్టు అనుమతి.. ఎందుకలా చెప్పిందంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి