తెలంగాణ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారానికి గురైన బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. 16 ఏళ్ల బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు హైకోర్టుఆదేశాలు జారీచేసింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. 


అత్యాచార బాధితురాలు.. గర్భం దాల్చింది. అయితే అబార్షన్‌ చేయించేందుకు బాధితురాలి తల్లి.. ఆసుపత్రికి తీసుకెళ్లింది. అబార్షన్ చేసేందుకు ఆసుపత్రి నిరాకరించింది. ఈ విషయంపై బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి. పిండం హక్కుల కన్నా అత్యాచార బాధితురాలి హక్కులే ముఖ్యమని విచారణ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. చట్ట పరిమితులకు లోబడి అవాంఛనీయ గర్భం వద్దనుకునే హక్కు ఉంటుందని హైకోర్టు తెలిపింది.


గతంలో బాంబే హైకోర్టు..


గతంలో ఈ తరహా కేసులో బాంబే హైకోర్టు అలాంటి తీర్పే ఇచ్చింది. అత్యాచారానికి గురైన ఓ మైనర్‌ బాలిక గర్భం దాల్చిన ఘటనలో 2020లో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాధితురాలి కడుపులో పెరుగుతున్న 24 వారాల పిండాన్ని తొలగించుకోవడానికి న్యాయస్థానం అనుమతించింది. వైద్య నిపుణుల సలహా తీసుకున్న అనంతరం ఈ తీర్పు వెలువరించింది. 


అత్యాచారానికి గురవడం ద్వారా గర్భం దాల్చిన తన కుమార్తె ప్రెగ్నెన్సీ తొలగించుకోవడానికి తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరుతూ బాధితురాలి తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. గతేడాది జరిగిన అత్యాచారం కారణంగా తన బిడ్డ గర్భం దాల్చిందని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తన కుమార్తె తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తోందని.. అందువల్ల గర్భం తొలగించడానికి వెంటనే అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తన కుమార్తె చదువుపై శ్రద్ధ పెట్టడానికి తోడ్పడుతుందని అభ్యర్థించారు.


బాలిక తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర విచారణ చేపట్టింది. ఈ ఘటనలో వైద్య పరమైన అంశాలను నివృత్తి చేసుకోవడానికి ముంబైలోని జేజే హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. గర్భం తొలగించడం ద్వారా బాలికకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. గర్భం తొలగింపు బాలికపై ఎలాంటి ప్రభావం చూపదనే అంశంపై స్పష్టత వచ్చిన వెంటనే తీర్పు చెప్పింది.


24 వారాల్లో గర్భం తొలగించడం అనేది బాలికకు ప్రమాదం కలిగిస్తుందని.. ఇదే సమయంలో గర్భం కొనసాగింపు ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి కలిగిస్తుందని జేజే ఆస్పత్రి వైద్య నిపుణులు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గర్భం తొలగించడమే ఆమెకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. బాధితురాలు తనకు నచ్చిన హాస్పిటల్‌లో గర్భం తొలగించుకోవచ్చునని సూచించారు. ఈ నివేదికను పరిశీలించిన బాంబే న్యాయస్థానం.. బాలిక అబార్షన్‌కు అనుమతి ఇస్తూ  తీర్పు చెప్పింది.


Also Read : సమస్యలు పరిష్కరించకపోతే పోరు బాట.. ఏపీ ప్రభుత్వానికి రెండు ఉద్యోగ సంఘాల హెచ్చరిక !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి