ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. అయితే వ్యాక్సిన్‌ల వల్ల ఎంతకాలం రక్షణ ఉంటుందనే అంశంపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. వీటిపై అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా.. వాటినుంచి కలిగే రక్షణ కొన్ని నెలలకే క్షీణిస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
పురుషులపై..
ఈ అధ్యయన ఫలితాల ప్రకారం మహిళల కంటే పురుషుల్లోనే టీకా రక్షణ తక్కువ ఉంటున్నట్లు తేలింది. దీంతో బూస్టర్ డోసుల ఆవశ్యకతపై పలు దేశాలు చేస్తోన్న ప్రకటనలకు ఈ అధ్యయనాలు బలం ఇస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌లో 5 వేల మంది ఆరోగ్య కార్యకర్తలపై ఓ అధ్యయనం చేశారు. వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత వీరిలో కరోనా నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు క్రమంగా క్షీణిస్తున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైంది.
మరిన్ని పరిశీలనలు..
- ఆరోగ్యవంతులతో పోలిస్తే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కొవిడ్ యాంటీబాడీలు త్వరగా క్షీణిస్తున్నాయి.
- చిన్న వయసు వారి కంటే వృద్ధుల్లో యాంటీబాడీలు వేగంగా తగ్గిపోతున్నాయి.
- టీకా వల్ల వృద్ధి చెందే యాంటీబాడీలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు, కనిష్ఠ స్థాయికి తగ్గిపోయినపుడు పరిశీలిస్తే మహిళల్లో కంటే పురుషుల్లోనే వీటి సంఖ్య తక్కువగా ఉంది.
ఫైజర్ వ్యాక్సిన్‌లు ఇచ్చే రక్షణపై ఈ మధ్యే కతర్‌లోనూ అధ్యయనం చేశారు. రెండో డోసు తీసుకున్న తొలి నెలలో యాంటిబాడీలు 77.5 శాతం రక్షణ కల్పించగా ఐదు నుంచి ఏడు నెలల్లోనే ఇవి 20 శాతానికి పడిపోయినట్లు వెల్లడైంది.
భారత్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని.. పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ వచ్చే ఏడాది మొదట్లోనే థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని సర్వేలు వస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు కోరుతున్నప్పటికీ ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. చాలా మంది కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు.
Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Also Read: PM Modi 20 Years: మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి.. ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ