ఏపీలో పనిచేస్తూ తెలంగాణకు వెళ్లాలని అనుకుంటున్న ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు రిలీవ్‌ చేసే ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ స్థానికతతో పాటు జీవిత భాగస్వాములు ఆ రాష్ట్రంలో పని చేస్తున్నవారికి ఈ వెసులుబాటు కల్పించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి బదిలీపై వెళ్లానుకునే ఉద్యోగుల నుంచి ఆప్షన్‌ ఫార్మ్స్‌ సేకరించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు.


ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉందని ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేడర్లలో సుమారు 2వేల మంది వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ వెళ్లాలనుకున్న ఉద్యోగులు..వచ్చేనెల 7లోగా ఆప్షన్లు ఇవ్వాలని సీఎస్ సమీర్‌ శర్మ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత హెచ్​వోడీలకు ఆప్షన్లు ఇవ్వాల్సిందిగా సూచించారు.


ఉద్యోగుల అభ్యర్థన మేరకు..స్థానికత, భాగస్వామి దృష్ట్యా తెలంగాణకు పంపాలని ఉద్యోగుల గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉద్యోగుల విజ్ఞప్తిని సంఘం ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా..రిలీవ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మెుదలుపెట్టింది. తెలంగాణ వెళ్లాలనుకునే వారి నుంచి ఆప్షన్ ఫార్మ్స్ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఈనెల 5న ఆదేశించారు.


గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..


తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు, అధికారులను ఆ రాష్ట్రానికి శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ కిందటి నెల తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడి ఉద్యోగులను బదిలీపై ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అక్కడి సర్కారుకు తెలియజేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. క్షమశిక్షణ చర్యలు, విజిలెన్స్‌ కేసులు పెండింగులో ఉన్నవారికి మాత్రం ఈ అవకాశం ఉండదని స్పష్టం చేసింది.


ఏపీ రాష్ట్రానికి వెళ్లాలనుకునే ఉద్యోగులు తమ శాఖల్లో  అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. వాటిని శాఖాధిపతులు ప్రభుత్వం దృష్టికి తేవాలి. సంబంధిత శాఖాధిపతి సిఫారసుతో ఉద్యోగి పనిచేసే శాఖ కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం పంపించాలి.
ఏపీ సర్కారు అనుమతి లభించిన ఉద్యోగులను వెంటనే సంబంధిత శాఖాధిపతి రిలీవ్‌ చేయాలి. ఈ సమాచారాన్ని సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
రిలీవ్‌ అయినవారు శాశ్వతంగా బదిలీ అయినట్లే పరిగణిస్తారు. మళ్లీ వెనక్కి వచ్చేందుకు అవకాశం ఉండదు. బదిలీపై వెళ్లేవారికి ప్రయాణ, కరవు భత్యాలు (టీఏ, డీఏలు) ఉండవు.


Also Read: పాతబస్తీలో అసదుద్దీన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి అలా చేస్తే తీవ్ర పరిణామాలని హెచ్చరిక


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.