ఎన్నికలంటేనే ఖర్చు. ఇక ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ పార్టీలు మంచి నీళ్లలాగా డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటాయి. గత మూడు నెలల హుజురాబాద్‌లో పార్టీలు ఎంతెంత ఖర్చు చేస్తున్నాయో అంచనా వేయడం కష్టం.  కానీ కోట్లలోనే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ హుజురాబాద్‌లో ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అధికార పార్టీ తన శక్తియుక్తులను మొత్తం అక్కడ కేంద్రీకరించింది. ఫలితంగా ప్రజల పంట పండింది. పథకాల వరద పారుతోంది. అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల కోసమే ఇవన్నీ చేస్తున్నారని బహిరంగ రహస్యం. ఇలాంటి ఖర్చు హుజురాబాద్‌లో ప్రభుత్వం ఏకంగా రూ. మూడున్నర వేల కోట్ల వరకూ ఖర్చు పెడుతోంది.



Also Read : హుజూరాబాద్‌లో ప్రచార వ్యూహాలు షురూ.. మార్నింగ్ వాక్‌లో మంత్రి, గ్రౌండ్‌లో ఎక్సర్‌సైజులు


రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు ! 


మట్టి రోడ్లే సరిగ్గా ఉండని చోట సిమెంట్ రోడ్లు వచ్చేశాయి. చీకటిపడితే కరెంటే ఉండని చోట వీధి లైట్లు వచ్చేశాయి. మురుగునీరు పోయే దారి లేక డ్రైనేజీ కంపు కొడుతూ ఉండిపోయిన కాలనీల్లో ఇప్పుడు పరిశుభ్రవాతావరణం కనిపిస్తోంది. డ్రైనేజీ కాలువలు వచ్చాయి. ఇవన్నీ  ఇప్పుడు హుజురాబాద్‌లో ఉన్న పరిస్థితులు. ఎప్పుడైతే ఈటల రాజేందర్ రాజీనామా చేశారో అప్పుట్నుంచి హుజురాబాద్‌లో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. ప్రకటనలు మాత్రమే కాదు  టెండర్లు, కాంట్రాక్టులు, పనులు అన్నీ చకచకా పూర్తయిపోయాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లింక్​ రోడ్లకు రూ. 220 కోట్లు ఖర్చు చేస్తున్నారు. హుజురాబాద్​ మున్సిపాలిటికి రూ. 35 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి రూ. 30 కోట్లు వరకూ విడుదల చేశారు. ఇక స్థానిక సంస్థలైన మండల, జిల్లా పరిషత్‌లకూ దాదాపుగా రూ. రెండు వందల కోట్లను విడుదల చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 410 కోట్లు అభివృద్ధి పనుల కోసం మంజూరు కాగా.. పరిపాలనా అనుమతులు జారీ చేసినవి మరో రూ. 190 కోట్లు ఉన్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి.



Watch Video : వేడెక్కిన హుజూరాబాద్ రాజకీయాలు


సంక్షేమ పథకాలకు రూ. రెండున్నర వేల కోట్లు !


సంక్షేమమే ఓట్లు కురిపించడానికి తారకమంత్రమని టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా నమ్మింది. అందుకే చరిత్రలో లేని విధంగా ఇంటికి రూ. పది లక్షలు పంపిణీ చేసే దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఏ మాత్రం ఆలస్యం లేకుండా రూ. 2వేల కోట్లను మంజూరు చేసింది. విడుదల చేసింది. ఇప్పుడా మొత్తం లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఓటింగ్ లోపే పంపిణీ చేయవచ్చని చెబుతున్నారు. ఇక పెన్షన్లు, రేషన్ కార్డులు జారీ చేయడం ఎప్పుడో నిలిపివేశారు. కానీ హుజురాబాద్‌లో మాత్రం ప్రత్యేకంగా మంజూరు చేశారు. ధరఖాస్తు చేసుకున్న వారందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీని గత మూడేళ్లుగా ప్రభుత్వం ఇవ్వడం లేదు. కానీ హుజురాబాద్ డ్వాక్రా మహిళలకు రూ. 120 కోట్లు పంపిణీ చేశారు. ఇక గొర్రెల పథకం రెండో విడతలో డీడీలు కట్టిన వారికీ పంపిణీ చేయలేదు. తెలంగాణ వ్యాప్తంగా అలా 32వేల మంది ఉన్నారు. వారికి ఇప్పటికీ గొర్రెల యూనిట్లు అందలేదు. కానీ హుజురాబాద్‌లో ఉన్న 2800 మంది డీడీలు కట్టిన లబ్దిదారులకు ఉన్న  పళంగా నిధులు విడుదల చేసి రూ. 80కోట్లతో గొర్రెల యూనిట్లు ఇప్పించారు. ఈ సంక్షేమ జాతర అలా కొనసాగుతూనే ఉంది.


Also Read : హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపు నాదే... టీఆర్ఎస్ ఓటర్లను బెదిరిస్తోంది...ఈటల రాజేందర్ కామెంట్స్


కుల సంఘాలకు నిధుల వరద !  


దళిత బంధు పథకంతో దళితుల్ని మాత్రమే బాగు చేస్తున్నారని ఇతర సామాజికవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో ప్రభుత్వం విరుగుడుగా ఇతర వర్గాలను ఆకట్టుకునేందుకుప్రయత్నిస్తోంది. సామాజికవర్గాల వారీగా మంత్రి హరీష్ రావు సమావేశాలు పెట్టి అనేక తాయిలాలు ప్రకటించారు. ఆత్మీయసభలు నిర్వహించారు. పెద్ద ఎత్తున వీటికి ఖర్చు చేశారు. ప్రతీ సభలోనూ వారికి కులసంఘ భవనం.. స్థలం మంజూరు హామీలు ఇచ్చారు. మున్నూరు కాపు, రజక సామాజిక వర్గాల ఆత్మగౌరవ భవనాలకు ఎకరా స్థలం, రూ.50 లక్షల నిధులు చొప్పున విడుదల చేశారు. గౌడ సంఘానికి ఎకరా స్థలంతో పాటు రూ. కోటిని మంజూరు ఉత్తర్వులను మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు గంగుల, కొప్పుల అందించారు. ఇక  మహిళా ఆత్మగౌరవ భవనానికి కూడా ఎకరా స్థలం, రూ.కోటి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వైశ్య సామాజిక వర్గానికి భవనం కోసం ఎకరా స్థలాన్ని కేటాయించారు.


Also Read : ఉపఎన్నికలపై హఠాత్తుగా మనసు మార్చుకున్న ఈసీ ! తెర వెనుక ఏం జరిగింది ?


రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు అదనం ! 


ఇక రాజకీయ పార్టీలు ఓటర్లకు పెట్టే ఖర్చు అదనం. ప్రభుత్వ స్కీములతో పాటు ఎలాగూ ఎన్నికలు ముగిసే వరకూ ఓటర్లకు ప్రత్యేకమైన మర్యాదలు చేస్తూనే ఉంటారు. ఇక ఓటింగ్‌కు ముందు పరిస్థితిని బట్టి నోట్ల వరద పారే అవకాశం ఉంది. ఎలా చూసినా ప్రభుత్వమే ఎన్నికల వ్యూహంతో రూ. మూడున్నర వేల కోట్ల వరకూ వెచ్చిస్తోంది.ఇక రాజకీయ పార్టీలు ఎంత వెచ్చిస్తాయో అంచనా వేయడం కష్టం. 


Also Read : త్వరలో రెడ్డి కార్పొరేషన్ .. హుజూరాబాద్‌లో హరీష్ హామీ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి