తెలంగాణ హుజూరాబాద్ లో ఎన్నికల గంట మోగింది.  అక్టోబర్ 30వ తేదీన పోలింగ్, నవంబ్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో హుజూరాబాద్ లో ఎన్నికల వేడి పెరిగింది. హుజూరాబాద్‌ ప్రజలు తన వెంటే ఉ‍న్నారని, ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన ఐదు నెలలు తర్వాత ఎన్నికలు పెడుతున్నారన్నారు. ఐదు నెలల నుంచి అరడజను మంత్రులు హుజురాబాద్ మీద పడ్డారని విమర్శించారు.


హుజురాబాద్ ప్రజానీకం నా వెంటే : ఈటల


ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేసేలా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రలోభాలకు గురి చేశారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన హుజురాబాద్ ప్రజానీకం అంతా తన వెంట నిలిచిందన్నారు. మంత్రి హరీష్‌రావు సర్పంచ్‌లు, ఎంపీటీసీలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. హుజూరాబాద్‌లో సర్పంచ్‌లు ఇతర ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల మీద నమ్మకం లేదని, సిద్ధిపేట, ఇతర ప్రాంతాలను నుంచి జనాల్ని తీసుకువస్తున్నారని ఈటల ఎద్దేవా చేశారు. పెన్షన్ రావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు.


Also Read: తెలంగాణ దోస్త్‌ మూడో విడత సీట్ల కేటాయింపు.. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు..


టీఆర్ఎస్ ప్రలోభపెడుతుంది


దళితబంధు రావాలంటే టీఆర్‌ఎస్‌ కు ఓటు వేయాలని, ఆశ వర్కర్, ఏఎన్ఎమ్‌ల కుటుంబ సభ్యులు వేరే పార్టీలతో తిరగవద్దని బెదిరిస్తున్నారని ఈటల ఆరోపించారు. తనతో ఓ కండక్టర్ కరచాలనం చేస్తే అతన్ని సిరిసిల్లకు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా పోరాడాలని ఈటల రాజేందర్ సవాల్ చేశారు. ప్రజలకు 18 సంవత్సరాల పాటు చేసిన సేవ ఇప్పుడు కనబడుతుందని తెలిపారు. బెదిరింపులు, కుట్రలతో హుజూరాబాద్ ప్రజలను ఏమార్చలేరని ఈటల అన్నారు.


Also Read: వరద ముంపులో సిరిసిల్ల కలెక్టరేట్.. లోపలే చిక్కుకున్న కలెక్టర్, బయటికి ఇలా..


ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి


హుజూరాబాద్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చిందని కరీంనగర్‌ కలెక్టర్ ఆర్​వీ కర్ణన్‌ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కొవిడ్ టీకా రెండో డోసు తప్పనిసరిగా తీసుకోని ఉండాలని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు సైతం తప్పనిసరిగా రెండు డోసులు తీసుకుని ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్‌, శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. 3 పార్లమెంట్‌, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్‌, బద్వేల్ శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. హుజురాబాద్‌, బద్వేలులో అక్టోబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. 


Also Read: ప్రెస్ క్లబ్ వద్ద పోసానిపై దాడికి పవన్ ఫ్యాన్స్ ప్రయత్నం..పోలీసు రక్షణతో తరలింపు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి