ఇడ్లీని ఇష్టపడని వారుండరు. మనదేశంలో ఏ మూల కెళ్లిన కామన్ గా కనిపించే బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీయే. ఇక ఇడ్లీ సాంబారు జోడీ గురించి చెప్పక్కర్లేదు. తింటే నోట్లో కరిగి, గొంతులోకి జారిపోతుంది. ఇప్పుడీ వంటకాన్ని కాస్త కొత్తగా చేయడం మొదలుపెట్టారు కొంతమంది ఔత్సాహికులు. సాధారణంగా ఇడ్లీ ఎక్కడైనా గుండ్రంగానే ఉంటుంది. ఎవరో కాని పుల్ల ఐస్ రూపంలో ఇడ్లీని తయారుచేశారు. చిన్న స్టిక్ కు చివర పుల్ల ఐస్ రూపంలో ఇడ్లీని వండి వడ్డించారు. స్టిక్ పట్టుకుని ఇడ్లీని సాంబారులో ముంచుకుని తింటే సరి. చేతికి ఏదీ అంటకుండా తినే పద్దతిలో భాగంగా ఇడ్లీని ఇలా తయారుచేసుంటారని భావిస్తున్నారు చాలా మంది నెటిజన్లు. ఈ పుల్ల ఇడ్లీ ఫోటో నెట్టింట్లో వైరల్ మారింది.
తొలుత ఈ ఫోటో మైక్రో అంబీషియస్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్టు అయింది. తరువాత ఆ ఫోటో షేర్ అవుతూ వైరల్ గా మారింది. తెలిసిన సమాచారం మేరకు బెంగళూరులోని ఓ రెస్టారెంట్ లో ఈ ఇడ్లీలను తయారుచేస్తున్నట్టు సమాచారం. నెటిజన్లు కొంతమంది చేతికంటకుండా ఇడ్లీ తినేవిధానాన్ని కనిపెట్టారంటూ మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ‘ఏం బావుంది ఈ ఇడ్లీ’ అంటూ విసుక్కుంటున్నారు. మరికొంతమంది మాత్రం ఇది ఇడ్లీయా లేక ఖుల్ఫీయా అంటూ తికమకపడుతున్నారు.