‘‘కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చావునోట్లో తలపెట్టి’’ కేసీఆర్ తెలంగాణ తెచ్చారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ నిర్లక్ష్యంతో వెనుక బడ్డ హుజూరాబాద్ పట్టణాన్ని రూ.50 కోట్ల నిధులతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని గంగుల అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ నేడు విడుదలవుతుందని, నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభమవుతుందని అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు సీఎం కేసీఆర్ బీ ఫామ్ అందించారని చెప్పారు. మంచిరోజు చూసుకొని గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేస్తామని అన్నారు. శుక్రవారం (అక్టోబరు 1) ఉదయం హుజూరాబాద్ నియోజకవర్గ నేతలతో కలిసి పట్టణంలో మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. వాకింగ్‌కి వచ్చిన ప్రజల్ని కలుసుకున్నారు. మైదానాల్లో కలయతిరుగుతూ ఎక్సర్‌సైజులు చేశారు. 


పట్టణ వీధుల్లో తిరుగుతూ దుకాణాలు, సెలూన్లు, చిరు వ్యాపారులు తదితరులతో కలిసి ముచ్చటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అందరూ ఎందుకు మద్దతివ్వాలో మంత్రి వివరించారు. ప్రజలు, కులసంఘాల నేతలు, ఆటో యూనియన్ వాళ్లే స్వచ్ఛందంగా డబ్బులు జమ చేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ఫీజు కింద ఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ పరిణామంతోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ విజయం ఖాయమైందని చెప్పుకొచ్చారు. 


Also Read: పని మనిషిపై వంట మనిషి దాష్టీకం.. బలవంతంగా రూంలోకి లాక్కెళ్లి రేప్


గతంలో ఇక్కడికి వచ్చే సమయానికి హుజూరాబాద్ అస్తవ్యస్తంగా ఉందని, సరైన రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య వసతులు, కుల సంఘాల కమ్యూనిటీ హాళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆ ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పగానే నిధుల్ని మంజూరు చేశారని వివరించారు. మిగతా తెలంగాణకు దీటుగా హుజూరాబాద్‌ను అభివృద్ధి చేయాలనికేసీఆర్ ఆదేశించారని చెప్పారు. అందుకే అన్ని పనుల కోసం.. రూ.50 కోట్ల నిధులతో హుజూరాబాద్‌లో సీసీరోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, అన్ని కులసంఘాల ఆత్మగౌరవం పెంచేలా కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. 


Also Read: ఇంటిపై దాడులకు భయపడను.. చిరంజీవి మాట్లాడరా? పోసాని స్పందన.. ట్విస్ట్ ఇచ్చిన జనసేన నేత


ఈ అభివృద్ధి మరింత కొనసాగించేలా మరింత ఉత్సాహం ఇచ్చేలా ప్రజలు కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. గతంలో హుజూరాబాద్‌ ప్రజలు అందరూ కారు గుర్తుకే ఓటేశారని గుర్తు చేశారు. ఈ సారి కారు గుర్తుపై పోటీ చేస్తున్న వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు గతంలో ఈటలకు వచ్చిన మెజారిటీ కన్నా పది రెట్లు అత్యధికంగా వస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నేతలతో పాటు, ప్రజలు కూడా పాల్గొన్నారు.


Also Read: కుళ్లిన స్థితిలో నటి శవం.. గది నుంచి తీవ్ర దుర్వాసన, ఏం జరిగిందంటే..






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి