అర్ధరాత్రి తన ఇంటిపై దుండగులు రాళ్ల దాడి జరగడంపై నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. ఆ పని చేసింది పవన్‌ కల్యాణ్ అభిమానులేనని ఆరోపించారు. ఇలాంటి దాడులను తాను భయపడబోనని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నిస్తే ఇళ్లపై దాడి చేస్తారా? అంటూ పోసాని ప్రశ్నించారు. ఈ మేరకు పోసాని గురువారం విలేకరులతో మాట్లాడారు. అసలు పవన్‌ కల్యాణ్‌ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారని పోసాని అభిప్రాయపడ్డారు. ఆయన ఊసరవెల్లి రాజకీయాలు చేస్తుంటారని, ఆ తీరుపై ప్రశ్నించినంత మాత్రాన దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. 


Also Read : టెంట్ హౌస్‌లా పార్టీని కిరాయికి ఇస్తారు.. ఇండస్ట్రీతో పవన్‌కు సంబంధం లేదన్న పేర్ని నాని


పవన్ కల్యాణ్ డబ్బులు ఇచ్చి మరీ రాళ్లదాడి చేయిస్తున్నారని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. రాజకీయాలతో సంబంధం లేకున్నా తన భార్యను తిడుతున్నారని ఆవేదన చెందారు. ఇంత జరుగుతున్నా చిరంజీవి స్పందించకపోవడం బాధగా ఉందని అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టీడీపీ నాయకులు విమర్శలు చేస్తే తాను అడ్డుగా నిలబడి పోరాడానని చెప్పుకొచ్చారు. చిరంజీవిని సోదరుడిలా భావించి, ఆయన కుటుంబానికి రక్షణగా నిలిచానని, ఇప్పుడు ఆయన సోదరుడే తనపై దాడులు చేయిస్తుంటే చిరంజీవి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని పోసాని నిలదీశారు.


Also Read: నటుడు పోసాని ఇంటిపై ఇటుక రాళ్లతో దాడులు.. బూతులు తిడుతూ బీభత్సం


స్పందించిన జనసేన నాయకుడు
జనసేన పార్టీ కార్యకర్తలే పోసాని ఇంటిపై దాడికి పాల్పడి ఉంటారని అనుమానాలు, ప్రచారాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ పార్టీ నాయకులు స్పష్టత ఇచ్చారు. పోసాని ఇంటిపై దాడులను ఖండించారు. పోసాని ఇంటిపై దాడికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. పోసాని ఇంటిపై వైఎస్ఆర్ సీపీనే దాడి చేసి జనసేనపై రుద్దే కుట్ర జరుగుతోందని కిరణ్ అన్నారు. తాము రెండు రోజుల క్రితమే ఇలా జరుగుతుందని అంచనా వేశామని, ఇప్పుడు అదే ఘటన జరిగిందని కిరణ్ చెప్పారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహాతోనే పోసాని ఇంటిపై వైఎస్ఆర్ సీపీ దాడి చేయించిందని ఆరోపించారు. ఈ కుట్రను అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.



Also Read: ‘అయ్యయ్యో వద్దమ్మా? సుఖీభవ సుఖీభవ’.. ఈ వైరల్ వీడియో కథేందీ? ఎలా పుట్టింది?


Also Read: Pavan Kalyan Alone : "ఇండస్ట్రీ" పవన్‌ను వద్దనుకుందా ? తమ కోసం పోరాడినా ఒంటరిని చేశారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి