‘రిపబ్లిక్’ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ ఎవరి కోసం మాట్లాడాడు ?. సినిమా పరిశ్రమ కోసమే మాట్లాడారు. చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కల్యాణ్ సినిమా నిర్మాత కాదు. నటుడు మాత్రమే. అందుకే అందరి తరపున మాట్లాడారని అనుకోవాలి.  కానీ సినిమా పరిశ్రమ ఏమంటోంది ?. మూడు రోజుల పరిణామాల తర్వాత చూస్తే ఆయన మాటలు ఇండస్ట్రీ కోసం కాదంటోంది.  ఇండస్ట్రీని రాజకీయం కోసం వాడుకోవద్దంటోంది. అంటే పవన్ కల్యాణ్‌ను ఒంటరి చేసేశారా..? 


మొదట ఫిల్మ్ చాంబర్ - తర్వాత చిరంజీవి ! 
పవన్ కల్యాణ్ మాట్లాడిన తర్వాతి రోజే ఫిల్మ్ చాంబర్ పేరుతో ఓ ప్రకటన వచ్చింది. పవన్ కల్యాణ్ మాటలు వ్యక్తిగతమని సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదని ఆ ప్రెస్‌నోట్‌లో ఫిల్మ్ చాంబర్ చైర్మన్ కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత  దిల్ రాజు సహా ప్రస్తుతం భారీ చిత్రాలు తీస్తున్న , నాగవంశీ, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు అందరూ ప్రత్యేకంగా మచిలీపట్నం వెళ్లారు. మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఆ సమావేశం ఎజెండా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఇండస్ట్రీతో సంబంధం లేదని చెప్పడం. తర్వాత ప్రెస్‌మీట్‌లోనూ అదే చెప్పారు. మంత్రి పేర్ని నాని చెప్పడం వేరు.. నిర్మాతలు చెప్పడం వేరు. దిల్ రాజుతో పాటు సునీల్ నారంగ్ కూడా పవన్ కల్యాణ్ ఏదో ఇండస్ట్రీని రాజకీయాలకు వాడుకుంటున్నారన్నట్లుగా చెప్పారు. ప్రభుత్వంతో సమస్యల్లేవన్నట్లుగా ప్రకటన చేశారు. ఇంకా ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా విచారం వ్యక్తం చేశారట. మంత్రి పేర్ని నాని స్వయంగా ఈ విషయం ప్రకటించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదన్నారట. అంటే పవన్ కల్యాణ్‌ను చివరికి చిరంజీవి కూడా దూరం పెట్టారన్నమాట.


Also Read : ఎలాంటి యుద్ధానికైనా సిద్దం .. వైఎస్ఆర్‌సీపీ నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక !


ఇండస్ట్రీ కోసమే మాట్లాడానంటున్న పవన్ కల్యాణ్ ! 
పవన్ కల్యాణ్ తాను ఇండస్ట్రీ కోసం మాట్లాడానని అనుకున్నారు. కానీ ఇండస్ట్రీలోని పెద్దలు మాత్రం ఆయన రాజకీయం కోసం మాట్లాడారని అనుకున్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్‌కు స్పష్టత వచ్చినట్లుగా ఉంది. అందుకే ఆయన మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ కార్యవర్గ సమావేశంలోని తన ప్రసంగంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. తనకేమైనా ధియేటర్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. కొంత మంది నిర్మాతల వేదన చూడలేకే తాను మాట్లాడానన్నారు.  రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఫంక్షన్ నుంచి బుధవారం పేర్ని నానితో భారీ చిత్రాల నిర్మాతల సమావేశం వరకూ జరిగిన పరిణామాలను చూస్తే పవ‌న్ కల్యాణ్‌కు మద్దతుగా ఇద్దరు, ముగ్గురు యువహీరోలు మాత్రమే స్పందించారు. అంతే తప్ప ఇక ఎవరూ నోరు మెదపలేదు. పైగా వ్యతిరేక ప్రకటనలు వచ్చాయి. పవన్ కల్యాణ్ ఇండస్ట్రీని రాజకీయంగా వాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నారనేది స్పష్టమవుతోంది.


Also Read : టెంట్ హౌస్‌లా పార్టీని కిరాయికి ఇస్తారు.. ఇండస్ట్రీతో పవన్‌కు సంబంధం లేదన్న పేర్ని నాని


పవన్ మాటల్లో రాజకీయం ఉందా ? ఇండస్ట్రీ సమస్యలపై పోరాటం అనే యోచన ఉందా ?


ఇక్కడ నిజంగా పవన్ కల్యాణ్ రాజకీయం చేశారా లేదా  అన్న విషయం పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాటలు ఇండస్ట్రీ కోసమే కదా అన్న చర్చ సహజంగానే వస్తుంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం వైపు నుంచి సమస్యలు లేవని అగ్ర నిర్మాతలు కూడా చెప్పడం లేదు. సమస్యల్లేకపోతే  పరిష్కరించండి మహా ప్రభో అని ఏపీ ప్రభుత్వం చుట్టూ వారు తిరగాల్సిన పని లేదు. ఆ సమస్యలు ఎప్పటి నుండో ఉన్నవి కాదు. ప్రభుత్వం సృష్టించినవే. ఆ సమస్యలు తెలంగాణలో లేవు. ఒక్క ఏపీలో మాత్రమే ఉన్నాయి. పేర్ని నానితో సమావేశమైన వారిలో ప్రస్తుతం ధియేటర్లలో ఉన్న లవ్ స్టోరీ సినిమా నిర్మాత సునీల్ నారంగ్ కూడా ఉన్నారు. ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ ఓ మాట అన్నారు. అదేమిటంటే ప్రస్తుతం ఏపీలో ధియేటర్లలో యాభై శాతం టిక్కెట్లు అమ్మడానికే పర్మిషన్ ఇస్తున్నారు. వంద శాతం కావాలి అని. ఇలాంటి సమస్యలు ఏపీ ప్రభుత్వంతో చాలా ఉన్నాయి. ఇటీవల టిక్కెట్ రేట్లను తగ్గించేశారు. పదేళ్ల కిందటి నాటిరేట్లను పెట్టారు. అలాగే బెనిఫిట్ షోలను రద్దు చేశారు. అదనపు షోలు వేసుకునే అవకాశాన్ని రద్దు చేశారు. గతంలో ఉన్న సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఇలాంటి అవకాశాలన్నింటినీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. అందుకే లాగేసుకున్న తమ అవకాశాలను మళ్లీ కల్పించాలని.. అదే సమస్యలను పరిష్కరించడం అని టాలీవుడ్ నిర్మాతలు ఏపీ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇలాంటి విషయాన్ని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సౌకర్యాలన్నీ వారికి లభిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కూడా అదే విషయాన్ని చెప్పారు.


Also Read : ‘మా’ వారసుడు మంచు విష్ణు.. తెలుగోళ్లే పోటీ చేయాలి.. ఎవడు పడితే వాడు ఆ సీట్లో కూర్చుంటే..: నరేష్ వ్యాఖ్యలు


ఏపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేది పెద్ద హీరోల సినిమాలే.. చిన్న సినిమాలకేం ఇబ్బంది లేదు ! 
అసలు విషయం ఏమిటంటే ఏపీ ప్రభుత్వానికీ ఈ విషయంలో కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ కోసం మాట్లాడలేదన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కేవలం పెద్ద సినిమాలను మాత్రమే ఇబ్బంది పెడతాయి. ఈ విషయంలో ఒకసారి పరిశీలన చేస్తే ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా ఉన్న చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ వంటి హీరోల సినిమాలకు మాత్రమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. వారి సినిమాలకు మాత్రమే బెనిఫిట్ షోలు ఉంటాయి. టిక్కెట్ రేట్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. అదనపు షోలు కూడా వారి సినిమాలకే అవసరం అవుతాయి. ఇతర హీరోలు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. వారికి మామూలుగా రిలీజ్ అయి నాలుగు షోలు హౌస్ ఫుల్ అయితే వారికి సక్సెస్ లభించినట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జున, వెంకటేష్ వంటి వారికి కూడా బెనిఫిట్‌షోలు వేసే పరిస్థితి లేదు. టిక్కెట్ రేట్లు పెంచితే చూసేందుకు ఫ్యాన్స్ కూడా రారు. ఎలా చూసినా పెద్ద హీరోలు ఫ్యాన్స్‌ను దోపిడి చేసుకుంటున్నారని.. దీన్ని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. పవన్ కల్యాణ్‌కు ఇది నచ్చలేదని అందుకే ఆయన తన కోసమే మాట్లాడారు కానీ ఇండస్ట్రీ కోసం కాదంటున్నారు. పైన చెప్పుకున్న అరడజన్ టాప్ హీరోల్లో నలుగు మెగా క్యాంప్ హీరోలు, మహేష్ బాబు, బాలకృష్ణ కాకుండా చిరంజీవి, పవన్ కల్యాణ్,  రామ్ చరణ్, అల్లు అర్జన్ ఒకే కుటుంబానికి చెందిన వారు. వారి కోసమే పవన్ మాట్లాడారని బలంగా వాదించే వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం వారెవరూ నిర్మాతలు కాదు. అంతిమంగా లాభనష్టాలు నిర్మాతలకు మాత్రమే దక్కుతాయి. కానీ సినిమా వ్యాపారం మీదే హీరోల రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుంది. పవన్ కల్యాణ్ పోరాటం వల్ల బాగుపడేది అగ్రనిర్మాతలే. అందులో ఒక్క శాతం కూడా డౌట్ లేదు. ఆ అగ్ర నిర్మాతలందరూ  పవన్ కల్యాణ్‌ది రాజకీయమేనని.. తమకు సంబంధం లేదని అంటున్నారు. అంటే పవన్ కల్యాణ్‌ను నిర్మోహమాటంగా వారంతా దూరం చేసుకున్నట్లే అనుకోవాలి. 


Also Read : డ్రగ్స్ పోయి బూతులు వచ్చే ఢాం..ఢాం..ఢాం ! రాజకీయం అంతా డైవర్షన్ పాలిటిక్సేనా ?


ఆన్‌లైన్ టిక్కెట్ల వల్ల సమస్య లేకపోతే తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకడగడం లేదు ? 
నిగూఢంగా ఈ అంశాలున్నప్పటికీ పైకి ఎక్కువగా వినిపిస్తున్న అంశం ఆన్ లైన్ టిక్కెటింగ్. ఆన్‌లైన్‌లో టిక్కెట్లను ఇప్పటికే అమ్ముతున్నారు. కానీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలనుకోవడమే వివాదానికి కారణం అయింది. ఓ కార్పొరేషన్ పెట్టి టిక్కెట్లను అమ్మడం ద్వారా ఆ ఆదాయాన్ని చూపించి ప్రభుత్వం అప్పులు తీసుకోవాలనుకుంటోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నిర్మాతల్లోనూ ఇదే భయం ఉంది. పేర్ని నానితో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన సునీల్ నారంగ్ ..ఆన్ లైన్ టిక్కెటింగ్ ద్వారా వచ్చే డబ్బులను ప్రభుత్వం ఎప్పుడో ఇస్తుందన్న అనుమానాలు ఉన్నాయని.. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఇచ్చేలా చూడాలని కోరారు. పవన్ కల్యాణ్ కూడా ఇదే చెబుతున్నారు. అంటే ఇండస్ట్రీ కోసమే ఆయన మాట్లాడారని అనుకోవాలి. నిజానికి ఆన్ లైన్ టిక్కెట్ల వల్ల ఎలాంటి సమస్యలు లేకపోతే..  తెలంగాణ ప్రభుత్వం కూడా అదే విధానం తీసుకు రావాలని ఎందుకు ఒత్తిడి చేయడంలేదో నిర్మాతలు చెప్పాల్సి ఉంది.


Also Read : బద్వేలు బరిలో బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి ! పోటీకి ఎవరు ముందుకు వస్తారు ?


ఇండస్ట్రీ కోసం మాట్లాడినా మద్దతివ్వలేకపోయిన పరిశ్రమ.. పవన్ ఒంటరే..!
మొత్తంగా చూస్తే పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ కోసమేమాట్లాడారని అనుకోవాలి.  ఆయన కోసం ..రాజకీయం కోసం కూడా మాట్లాడారని అనుకోవాలి. ఎందుకంటే ఆయన సినీ ఇండస్ట్రీలో భాగం. అలాగే రాజకీయ పార్టీ అధినేతగా రాజకీయ వ్యవస్థలోనూ భాగం. అందుకే ఆయన తన కోసం..రాజకీయం కోసం మాట్లాడారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ కోసం కూడా మాట్లాడారన్నది వాస్తవం. ఆ విషయం ఇండస్ట్రీ పెద్దలకూ తెలుసు. కానీ వారు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. చివరికి పవన్ కల్యాణ్‌ను ఒంటరి చేశారు. దీనికి మాత్రం వంద శాతం రాజకీయమే కారణం అని అనుకోవాలి. అంతిమంగా సినీ పరిశ్రమ అటు పోరాటమో.. ఇటు రాజీనో తేల్చుకోలేక తమ కోసం మాట్లాడిన పవన్‌ను రాజకీయనేత కేటగిరిలో చేర్చేశారు.  


Watch Video : ఇన్నాళ్లు సామాజిక సేవకుడిగా ఆలోచించా... ఇక రాజకీయాలే చేస్తా: పవన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి