‘మా’ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. బుధవారం ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్.. మంచు విష్ణు ప్యానెల్‌కు మద్దతు ప్రకటిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో మంచు విష్ణుతోపాటు ఆయన ప్యానెల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. తాను 20 ఏళ్లుగా ‘మా’ సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. ‘మా’కు యువరక్తం కావాలని, అందుకే తాను మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నానని తెలిపారు. మాలో వివిధ పదవుల్లో తాను ఎన్నో సేవలు అందించానని, ‘మా’కు మరింత మంచి జరిగేందుకు మంచు విష్ణు తగిన వారసుడు అని నరేష్ పేర్కొన్నారు. ‘‘ఒక మిక్సీని 2 వేలు పెట్టి కొనేప్పుడు దాని బ్రాండ్ చూస్తాం. వారంటీ చూస్తాం. అటువంటిది.. ఎవడుపడితే వాడు వచ్చి ఆ సీట్లో కూర్చోంటే ‘మా’ మసకబారడం కాదు కదా.. మచ్చపడే పరిస్థితి ఉంది. అయితే, ఎవరూ రాకముందు జరిగిన పరిస్థితి గురించి చెబుతున్నా’’ అని నరేష్ అన్నారు. 


నాది కృష్ణుడి పాత్ర.. విష్ణు రథం ఎక్కుతున్నా: ‘‘ప్రకాష్ రాజు నాకు మంచి ఫ్రెండ్. పోటీ చేస్తున్నా అని చెబితే చేయమన్నాను. వెల్‌కమ్ చెప్పాను. కానీ, మాకు యంగ్ స్టర్ ఇవ్వాలనే ఉద్దేశంతో విష్ణుకు మద్దతు ఇస్తున్నాను. విష్ణు మంచు ఒక బ్రాండ్. 75 సినిమాలు తీసి ఎంతోమందికి అన్నం పెట్టిన ఫ్యామిలీ వారిది. విష్ణు హైదరాబాదులోనే ఉంటారు. ఎవరికైనా సమస్య అంటే వెంటనే స్పందిస్తారు. పాఠశాలను యూనివర్శిటీ స్థాయికి తీసుకొచ్చిన మంచి అడ్మినిస్ట్రేటర్ విష్ణు. తప్పు జరిగితే విష్ణు నేను ఎక్కడికీ పారిపోలేం. మోహన్ బాబు కూడా ఇక్కడే ఉంటారు. ఇన్ని గ్యారంటీలు చూసుకుంటే.. విష్ణు పర్‌ఫెక్ట్ అనిపించింది. నాది నాది కృష్ణుడి పాత్ర.. ‘మా’ కోసం మంచు విష్ణు రథం ఎక్కుతున్నా’’ అని తెలిపారు. 


Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు


ఈ ప్రశ్నలకు ప్రకాష్ రాజ్‌పై నరేష్ ప్రశ్నల వర్షం: ‘‘20 ఏళ్లలో ఒక్కసారైనా వచ్చి ‘మా’ ఎన్నికల్లో ఓటేశారా? జనరల్ బాడీ మీటింగులకు ఒక్కసారైన హాజరయ్యారా? మీరు సస్పెండ్ అయ్యారా లేదా? ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు? సభ్యులకు కనీసం ఎప్పుడైనా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారా? మీరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నేను అనంతపురం జిల్లాను దత్తత తీసుకున్నా. ఆ ప్రాంతం కోసం పాటుపడుతున్నాం’’ అని అన్నారు.


ఆ మాటలను ప్రకాష్ రాజ్ వెనక్కి తీసుకోవాలి: ‘‘సినీ నటులకు ఒక స్థానమంటూ లేదు. ప్రకాష్ రాజ్ ఓ మాట అన్నారు. అది నా మనసుకు గుచ్చుకుంది. తెలుగు పరిశ్రమలో సరైనవారు ఎవరూలేరు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. అంటే తెలుగువారు ఎవరూ లేరా? ఎన్టీఆర్ రక్తం మనలో లేదా? రఘుమతి వెంకయ్య నాయుడు రక్తం మనలో లేదా? అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు రక్తం మనలో లేదా? తెలుగు పరిశ్రమలో అన్ని భాషలవాళ్లు పనిచేస్తారు. కానీ, ఇక్కడి పరిశ్రమను నడిపేది మాత్రం తెలుగువాళ్లు. ఇతర భాషలవారు ఇక్కడ గెస్టులు. వేరే పదవులకు ఎవరు పోటీ చేసినా పర్వాలేదు. కానీ, అధ్యక్షుడి పోస్టులో మాత్రం తెలుగువారే ఉండాలి. ఇక్కడ తెలుగువారు ఎవరూ లేరనే మాటను వెనక్కి తీసుకోవాలి. పొరపాటున గెలిస్తే.. తెలుగువారు లేరని నన్ను గెలిపించారని చెప్పుకుంటారా? ‘మా’లో పాములు ఉన్నాయి. కానీ, పుట్టలు మారుతున్నాయి. అలాంటివి వద్దు. మీరు ఏ ప్యానెల్‌ను గెలిపించినా.. పూర్తి ప్యానెల్‌ను గెలిపించండి. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఈ మూడు గెలిస్తేనే ఆ ప్యానెల్‌కు గ్రిప్ ఉంటుంది. లేదంటే జుట్టు ఇంకొకరికి ఇచ్చినట్లు అవుతుంది’’ అని నరేష్ తెలిపారు. 


Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్


‘‘ప్రకాష్ రాజ్ మా సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన అబద్దాలు చెబుతున్నారు. మా ఎన్నికలో క్షుద్ర రాజకీయాలు చేయొద్దు. కళాకారులకు అవకాశం ఇచ్చేందుకే ‘మా’ ఉన్నది. దేశాన్ని, దేశ ప్రధానినే తిట్టినవాడు.. రేపు జీవిత, హేమా వంటి మంచి జనాలతో కలిసి ఎలా పనిచేస్తాడో అనేదే మా భయం’’ అని నరేష్ పంచ్ పేల్చారు. కరోనా ఇబ్బందులు ఉన్నప్పుడు కళాకారులకు ఉప్పులు, పప్పులు ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. 300 పైగా ఆసుపత్రులతో ‘మా’కు అసోషియేషన్ ఉందని, ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ గుర్తుంచుకోవాలన్నారు.  


Also Read: పేద కళాకారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. బండ్ల గణేష్ ‘మా’ హామీ!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి