ఏపీలో టాలీవుడ్ పరిస్థితులపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గళమెత్తిన సంగతి తెలిసిందే. అయితే, పవన్ స్పీచ్‌పై టాలీవుడ్ ప్రముఖులు మాత్రం మౌనం వహిస్తున్నారు. చివరికి ప్రకాష్ రాజ్ కూడా ఈ విషయంపై స్పందించడానికి సుముఖత చూపించలేదు. తెలివిగా తప్పించుకొనే ప్రయత్నం చేశారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్, తదితర సభ్యులు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. 


‘‘మంచు విష్ణు చెప్పినట్లుగా.. ఇది ‘మా’ సభ్యుల మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఇందులో రాజకీయ జోక్యం వద్దు. ఇవి ఎన్నికలు కాదు.. పోటీ మాత్రమే. గెలుపు. ఓటములను ‘మా’ సభ్యులే నిర్ణయిస్తారు. మేము ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉన్నాం. ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎన్నికలు సవ్యంగా జరగాలి’’ అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ‘‘పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు. ఆయనకు సిద్ధాంతాలు ఉంటాయి. ఆయన దేశానికి మంచి చేయడానికి వచ్చిన మంచి నాయకుడు. మా ప్రకారం ఆయన కూడా ‘మా’లో సభ్యుడు మాత్రమే. ప్రతి ఒక్కరికీ ఆవేశం, ప్రేమ, సిద్ధాంతాలు ఉంటాయి. ఆ ఆవేశంలో నిజాలు కూడా ఉంటాయి. పవన్ వ్యాఖ్యలకు వచ్చే ప్రతిఫలం బట్టి ముందుకెళ్దాం. ప్రస్తుతం ‘మా’ ఎన్నికలు గురించి మాట్లాడుతున్నాం. రాజకీయ వ్యాఖ్యలు చేయబోము. సభ్యులు మమ్మల్ని ఎంచుకున్న తర్వాత బాధ్యతగా ఇండస్ట్రీ గురించి మాట్లాడతాం. రాజకీయ వ్యాఖ్యలపై ఎవరూ ప్రశ్నించవద్దు’’ అని అన్నారు.


Also Read: 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్


అనంతరం జీవిత మాట్లాడుతూ.. ‘‘మా ఎన్నికలు సవ్యంగా సాగాలి. ఎవరినీ కించపరచకుండా, ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నాం. మీడియా కూడా మా మధ్య గొడవులు ఉన్నట్లు, గ్రూపులుగా విడిపోయారంటూ మాట్లడవద్దు. ఎన్ని వివాదాలు వచ్చినా మేమంతా ఒకే కుటుంబం. పృథ్వీ చేసిన ఆరోపణలు నన్ను బాధించాయి. ఆయన వ్యాఖ్యలు చిన్న పిల్లాడిలా ఉన్నాయి. ఎన్నికలను తప్పుదారి పట్టించవద్దు. ఎన్నికల్లో పోటీ మాత్రమే ఉంది. శత్రుత్వం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ ఎన్నికలు జరుగుతాయి. చిరంజీవి అందరివాడు. ఆయన విష్ణుకు కూడా మద్దతు ఇవ్వొచ్చు. ఎవరినీ ఒత్తిడి చేయడం’’ అని అన్నారు. 


Also Read: పవన్ కళ్యాణ్‌కు మోహన్ బాబు కౌంటర్.. నువ్వు నాకంటే చిన్నవాడివి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి