హోరాహోరీగా సాగుతున్న ‘మా’ ఎన్నికల కోసం బండ్ల గణేష్ సోమవారం నామినేషన్ వేశారు. మా ప్రెసిడెంట్ మాట వినకుండా గత రెండేళ్ల నుంచి ‘మా’లో ఆగం ఆగం జరిగిందని విమర్శించారు. తన అజెండా ఒకటే అని.. వంద మంది పేద కళాకారులకు తాను డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. సింహం సింగిల్ గా వస్తుందని, ఎవ్వరి వద్దా తాను ఫండ్ తీసుకోనని తేల్చి చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున తెలుగు సినిమా హీరోలతో సమావేశం ఏర్పాటు చేసి ఒక అరగంట సమయంలో వారి నుంచి రూ.25 కోట్లు కలెక్ట్ చేస్తానని వ్యాఖ్యానించారు. ‘‘వంద మందికి సరిపడా ఇళ్లు సాధిస్తానని నేను హామీ ఇస్తున్నాను. నన్ను ఘనంగా గెలిపించండి. పని చేసే వాడికి.. కసి ఉన్నవాడికి ఓటేయండి.’’ అని అన్నారు. సోమవారం బండ్ల గణేష్ నామినేషన్ వేసిన సందర్భంగా బండ్ల గణేష్ విలేకరులతో మాట్లాడారు.


‘‘ప్రతి రెండో ఆదివారం ‘మా’ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుందాం. నేను ‘మా’ బిల్డింగ్ కట్టను. 28 ఏళ్ల నుంచి ‘మా’ బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంది. దాంతో ఏం ఇబ్బంది ఉంది. కానీ, ఇప్పుడు ఇళ్లు లేని వంద మంది పేద కళాకారులకు నేను డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తా. కాబట్టి నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి. నేను గెలవక పోతే నేను అందర్నీ ప్రశ్నిస్తా. మీకు హామీలిచ్చిన వారిని గొంతు పట్టుకొని అడుగుతా. మనకు హీరోలు చాలు మనకి. వారితో అరగంట మీటింగ్ ఏర్పాటు చేసి వారి నుంచి పాతిక కోట్లు కలెక్ట్ చేస్తా. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిచ్చి అందరికీ భోజనాలు పెట్టించి మరీ ఇళ్లిస్తా. ‘మా’ బిల్డింగ్ కన్నా పేదలకు ఇళ్లే ముఖ్యం’’ అని బండ్ల గణేష్ అన్నారు.


అక్టోబరు 11 తర్వాతే దానిపై స్పందిస్తా: బండ్ల
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరగా.. తాను ఇప్పుడు మా ఎన్నికల మూడ్‌లో ఉన్నానని.. ఇప్పుడేమీ మాట్లాడదల్చుకోలేదని తేల్చి చెప్పారు. దైవంగా భావించే పవన్ కల్యాణ్‌ను ఏపీ మంత్రులు బూతులు తిడుతున్నారని, దానిపై స్పందించాలని కోరగా.. తాను ఎన్నికలయ్యే వరకూ ఏమీ మాట్లాడబోనని, 11వ తేదీ తర్వాత అందరికీ సమాధానం చెప్తానని చెప్పారు. మా అధ్యక్షుడు ఏనాడూ ఆఫీసుకు వచ్చి కూర్చోలేదని, రాబోయేకాలంలోనూ అలా జరగబోదని చెప్పారు.