ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గం మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయించారు. నిజానికి ఇదేమి కొత్త నిర్ణయం కాదు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే తన మంత్రులందరికీ రెండున్నరేళ్లే పదవీ కాలం అని నేరుగా చెప్పారు. ఆ తర్వాత 80 - 90 శాతం మందిని మార్చేసి కొత్త వారిని తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పుడుఆ రెండున్నరేళ్ల గడువు దగ్గర పడింది. జగన్ తను మొదట చెప్పిన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని ఆయనకు అత్యంత సన్నిహితుడు, బంధువు కూడా అయిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా బయటకు తెలిపారు. మిగతా మంత్రుల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అయితే అందర్నీ తీసేసి కొత్త వారికి చాన్సివ్వడం అంత సులువుగా అయిపోతుందా ? సీనియర్లు అంగీకరిస్తారా ? తనకు ఎదురు లేదని జగన్ మంత్రివర్గం మొత్తాన్ని మార్చేయడం ద్వారా నిరూపించుకుంటారా? అన్న సందేహాలు రాజకీయవర్గాల్లో ప్రారంభమయ్యాయి.
"ఎలక్షన్ కేబినెట్"కు ముహుర్తం దసరాకేనా !?
మంత్రివర్గ సమావేశంలో వచ్చే ఏడాది నుంచి మనమందరం రోడ్లపై ఉండాల్సిందేనని మంత్రులకు జగన్ చెప్పారు. దాని అర్థం అందరికీ పార్టీ బాధ్యతలు అప్పగించబోవడమేనని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ఇప్పటికే కసర్తతు కూడా ప్రారంభించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించేలా ఇప్పటికే ఓ రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారని అంటున్నారు. పార్టీ అధినేతగా జగన్‌కు ఏదీ చర్చోపచర్చలు జరిపి మేధో మథనం పేరుతో రకరకాల అభిప్రాయాలను ప్రచారంలోకి పెట్టి చివరికి ఓ నిర్ణయం తీసుకోవడం ఇష్టం ఉండదు. తనకు నచ్చిన నిర్ణయాన్ని అంతే వేగంగా అమలు చేస్తారు. అనేక అంశాల్లో అదే జరిగింది. అందుకే మంత్రులను మార్చడం ఖాయమని సమాచారం బయటకు తెలిసిన తర్వాత నాలుగైదు నెలల పాటు నాన్చే అవకాశం లేదని అంటున్నారు. దసరాకే ముహుర్తం ఉండవచ్చని చెబుతున్నారు. అప్పటికి రెండున్నరేళ్ల కోటా పూర్తవుతుంది. కొంత మంది మాత్రం సంక్రాంతి తర్వాతే ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. కొత్త టీమ్‌తోనే ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారని.. ఆయన సంక్రాంతి తర్వాతే పర్యటనలు ప్రారంభిస్తారు కాబట్టి అప్పుడే విస్తరణ ఉంటుందని నమ్ముతున్నారు.
నిర్ణయం బయటకు వచ్చాక ఎంత ఆలస్యమైతే.. అన్ని ఒత్తిళ్లు !
మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అంటే అధికార పార్టీలో ఉండే హడావుడికి కొదవేమీ ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యే అనిపించుకున్న ప్రతి ఒక్కరి లక్ష్యం మంత్రి కావడమే. అలా మంత్రి కావాలంటే ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలి. అందు కోసం రెండున్నరేళ్ల నుంచి తాము చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నారు ఆశావహులు. ఇంత కాలం విస్తరణ ఎప్పుడు ఉంటుందోఅన్న క్లారిటీ లేదు. ఉంటుందా ఉండదా అన్న సందేహం కూడా ఉంది. కొద్ది రోజుల నుంచి కరోనా కారణంగా మంత్రులు ఏడాదిన్నర పాటు పని చేయలేకపోయినందున పొడిగింపు గురించి సీఎం జగన్ ఆలోచిస్తున్నారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగింది. కానీ ఇప్పుడు మార్పు ఖాయమని తేలడంతో ఆశావహులంతా తమ ప్రయత్నాలు తాము చేస్తారు. ఈ క్రమంలో వారిపై ఒత్తిళ్లు పెరిగిపోతాయి. మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు.. పదవుల్ని కాపాడుకునేందుకు ఇతర నేతలు చాలాచాలా విన్యాసాలు చేస్తారు. అలాంటి పరిస్థితుల వల్ల పార్టీ, ప్రభుత్వంతో పాటు జగన్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని సీఎం జగన్ కోరుకోరు. అందుకే కసరత్తు పూర్తి చేసిన తర్వాతే విషయాన్ని బయటకు వచ్చేసారని చేశారని.. అంతే వేగంగా పునర్‌వ్యవస్థీకరణ కూడా పూర్తి చేస్తారని అంచనా వేస్తున్నారు.
సీనియర్ మంత్రులను బుజ్జగించడమే కష్టం !
ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారు తమను పదవుల నుంచి తొలగించినా అసంతృప్తి వ్యక్తం చేసే వారు కొందరే ఉంటారు. బహిరంగంగా వ్యక్తం చేసే వారు అసలు ఉండరు. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది మంత్రులు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. మంత్రి అనే హోదా కనిపిస్తుంది కానీ తమ శాఖలపై రోజువారీ సమీక్షలు చేసేవారు కూడా తక్కువే. అయితే కొద్ది మంది సీనియర్లు మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణతో పాటు పేర్ని నాని,కొడాలి నాని వంటి నేతలు తమ పదవులకు భరోసా ఉంటుందని నమ్ముతున్నారు. జగన్ వంద శాతం అని చెప్పలేదని 80 శాతమే అని చెప్పారని పేర్ని నాని మీడియాతో వ్యాఖ్యానించడం తమ పదవులు ఉంటాయని వారు నమ్మడానికి ప్రధాన కారణంగా భావించవచ్చు. రాజకీయాల్లో ఎవరికైనా మంత్రి పదవే టార్గెట్. పదేళ్లు పార్టీకోసం కష్టపడి పని చేసిన తర్వాత అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లే మంత్రి పదవి అంటే ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది. పెద్దిరెడ్డి, బొత్స వంటి నేతలకు ఎక్కువగానే ఉంటుంది. వారు తమ పదవులకు ఏ ఇబ్బంది ఉండదని నమ్ముతున్నారు. అలాంటి వారిని పదవి నుంచి తప్పిస్తే ఏం చేస్తారా అన్న సందేహాలు వైసీపీలో ఉన్నాయి.
Watch Video : కాలగర్భంలోకి ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్..!
మళ్లీ గెలుపు కోసం పార్టీ పదవులు !
ప్రస్తుతం తొలగిస్తున్న మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. పెద్దిరెడ్డితో పాటు బొత్స వంటి వారిని పార్టీ పదవుల్లో నియమిస్తామని .. మళ్లీ గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. నిజానికి వారికి పార్టీ పదవులు ఇచ్చినా చేసేదేమీ ఉండదు. పార్టీ వ్యవహారాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంజగన్ చూసుకుంటారు. ఇప్పటికే నాలుగు ప్రాంతాలకు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి వారికి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. తర్వాత మాజీ మంత్రులకు చాన్సిచ్చినా చేయడానికేమీ ఉండదన్న అభిప్రాయం ఉంది. ఆ విషయం మంత్రులకు కూడా తెలుసు కాబట్టే వీలైనంత వరకు తమ పదవుల్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.
Also Read : సైకిల్ పై పర్యటించిన తమిళనాడు సీఎం
వంద శాతం మంత్రుల మార్పు డేరింగ్ స్టెప్ !
దేశ రాజకీయాల్లో వంద శాతం మంత్రులను తొలగించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ఓ సారి బడ్జెట్ లీకయిందని ఎన్టీ రామారావు తన మంత్రులందర్నీ తొలగించారు. కానీ రాజకీయ కారణాలతో తొలగించిన సందర్భాలు లేవు. మొదటి సారి ఏపీ సీఎం జగన్ ఈ తరహా నిర్ణయం తీసుకుంటున్నారు. ఆయన పార్టీలో జగన్‌కు తిరుగులేని పట్టు ఉంది. ఎవరూ నోరు మెదిపే పరిస్థితి ఉండదు. ఆయనకు 151 మంది ఎమ్మెల్యేల బలం కూడా ఉంది. అందుకే ఆయన ధైర్యంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక వేళ సంఖ్య తక్కువగా ఉండి ఉన్నట్లయితే అలాంటి నిర్ణయంపై ఆలోచించి ఉండేవారమో..! అయితే జగన్ నిర్ణయం రాజకీయంగా సక్సెస్ అయితే కొత్త ట్రెండ్ సృష్టించినట్లుగానే భావించవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read : ఏపీలో వైట్ ఛాలెంజ్.. డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధమా అని టీడీపీ సవాల్...