" రిపబ్లిక్ " సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన ప్రధానంగా ప్రస్తావించి తీవ్రంగా విమర్శలు చేశారు. అందులో ప్రధానంగా టిక్కెట్ల అంశం ఉంది. సినిమాలు మేము తీసుకుంటే మీరు టిక్కెట్లు అమ్ముతారా అన్నది ఆ పాయింట్. నిజానికి ఏపీ ప్రభుత్వం టిక్కెట్లు అమ్మి పెట్టాలని చిరంజీవి,నాగార్జున కోరారాని చెబుతోంది. తాము కోరలేదని వారు ప్రకటించలేదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పుడు ఫైరయ్యారు. మొత్తంగా చూస్తే టాలీవుడ్‌తో ఏపీ ప్రభుత్వం గేమ్ ఆడుతోందన్న విమర్శలు పవన్ కల్యాణ్ సూటిగా చేసిన వ్యాఖ్యలతో వినిపిస్తున్నాయి.
తెలంగాణలో ఓకే టాలీవుడ్‌పై ఇంకా ఏపీ సర్కార్ ఆంక్షలు
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమల్లో టాలీవుడ్ కూడా అగ్రభాగంలో ఉంటుంది. ఈ కారణంగా ఎంతో మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. పాత తరహాలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతుల ుఇచ్చారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రోత్సాహకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పిచింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం టాలీవుడ్ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. కారణం ఏమిటో కానీ దేశం మొత్తం ఒక లాగా ఉంటే... ఏపీలో మాత్రం ఇప్పటికీ ధియేటర్లపై ఆంక్షలు ఉన్నాయి. మూడు షోలకు మాత్రమే అనుమతులు ... సగం టిక్కెట్లు మాత్రమే విక్రయించడం.. ఇంకా టిక్కెట్ రేట్లు పదేళ్ల కిందటి నాటివి ఖరారు చేయడం వంటి నిర్ణయాలతో ప్రభుత్వం సినీ పరిశ్రమతో ఆటాడుకుంటోంది. ఓ సినిమా విడుదల చేయాలంటే అటు ఏపీ.. ఇటుతెలంగాణలో ఒకే సారి విడుదల చేసుకోగలగాలి. లేకపోతే గిట్టుబాటు కాదు. అందుకే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఏపీ ప్రభుత్వ ఆంక్షల వలలో చిక్కుకుని విలవిల్లాడుతోంది.
Also Read : సినిమాలు ఆపేస్తే కాళ్ల దగ్గరకు వస్తాం అనుకుంటున్నారు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్..
చిరంజీవి టీమ్‌కు ఎందుకు వరుసగా అపాయింట్‌మెంట్లు క్యాన్సిల్ చేస్తున్నారు ?
మొదట్లో చిరంజీవి బృందం రెండు సార్లు జగన్‌తో సమావేశం అయింది. అప్పుడేం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత ఎలాంటి సమావేశాలు జరగలేదు. ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నాని స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి జగన్ అపాయింట్ మెంట్ ఇస్తారు..సమస్యలు చెప్పుకోండని ఆఫర్ ఇచ్చారు. చిరంజీవి కూడా సమస్యలు చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇండస్ట్రీకి చెందిన కీలక వ్యక్తులతో సమావేశమయ్యారు. అయితే అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. మొదట సెప్టెంబర్ నాలుగో తేదీ అన్నారు.. తర్వాత 20వ తేదీ అన్నారు. కానీ ఏ సమావేశమూ జరగలేదు. మధ్య లో ఓ సారి పేర్ని నాని హైదరాబాద్ వచ్చి చిరంజీవితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏం జరిగిందో.. ఏం చర్చించారో ఎవరికీ తెలియదు కానీ ఆ తర్వాత సినీ ప్రముఖులతో చర్చించడానికి జగన్ ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది. అదే సమయంలో టిక్కెట్లను కూడా ప్రభుత్వమే అమ్మేలా జీవో తీసుకు రావడం ఇప్పుడు పులిమీద పుట్రలా మారింది.
Also Read : 'కొండపొలం' ఇంట్రెస్టింగ్ అప్డేట్.. 'రొమాంటిక్' మూవీ రిలీజ్ డేట్..
టిక్కెట్లు అమ్మాలని చిరంజీవి, నాగార్జున కోరలేదా?
ఇప్పటి వరకూ చిరంజీవి, నాగార్జున కోరిక మేరకే టిక్కెట్లను ప్రభుత్వం అమ్ముతోందని చెబుతోంది. కానీ పవన్ కల్యాణ్ అన్న మాటల్ని బట్టి చూస్తే... ఎవరూ అలా ఏపీని కోరలేదని అర్థం చేసుకోవాలని అంటున్నారు. స్వయంగా చిరంజీవి ముందే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రకటనలను ఖండించలేదని నిస్సయహాతలో స్టార్లు ఉన్నారని భావించి ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేసిందని భావిస్తున్నారు. సినిమా వాళ్ల బలహీనతలతో రాజకీయం చేస్తూ.. టాలీవుడ్‌ను ఏపీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోందని పవన్ కల్యాణ్ మాటల ద్వారా అర్థమవుతోది.
చిరంజీవి, పవన్ కల్యాణ్ అసంతృప్తితో టాలీవుడ్ ఇక పోరుబాట పడుతుందా ?
టాలీవుడ్‌కు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని పవన్ కల్యాణ్ మాటల ద్వారా తెలుస్తుంది. పవన్ వ్యాఖ్యలపై రేపు ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తుందన్న దానిపైనే మిగతా సమస్యల పరిష్కారం ఆధారపడి ఉంది. ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో ఎవరూ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పడానికి ధైర్యం చేయలేదు. తొలి సారి పవన్ కల్యాణే నోరు తెరిచారు. ఇక మిగతా వారు కూడా ముందుకు వస్తే ఏపీ ప్రభుత్వంతో లెక్కలు చూసుకునే అవకాశం ఉంది. లేదంటే పవన్ ఒక్కడే పోరాడాల్సి ఉంటుంది.