ఐరాసలో ఓ యువతి మాట్లాడిన తీరు చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కే ఆమె షాకిచ్చింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని ప్రసంగానికి భారత్ తరఫున ఆమె బదులు ఇచ్చింది. పాక్ తీరును ఆమె ఎండగట్టిన తీరు నిజంగా అమోఘమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమే.. ఐరాసలో భారత మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వరిస్తోన్న స్నేహా దుబే
తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా పాకిస్థాన్ చెప్పుకుంటోంది. నిజానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందే పాకిస్థాన్. కానీ ఆ దేశం ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంది. అమెరికా జంట భవనాలపై ఉగ్రదాడికి పాల్పడిన ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది పాకిస్థాన్. తనవైపు ఇన్ని తప్పులు పెట్టుకొని అంతర్జాతీయ వేదికపై అసత్యాలు చెబుతోంది. - స్పేహా దుబే, ఐరాసలో భారత మొదటి కార్యదర్శి
ఎవరీమె?
- స్నేహా దూబే.. పుణెలో కళాశాల విద్యను అభ్యసించారు.
- ఆ తర్వాత దిల్లీ జేఎన్‌యూ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. అంతర్జాతీయ అంశాలపై పరిశోధన చేశారు.
- సివిల్స్ పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌గా ఎంపికయ్యారు.
- 2012 బ్యాచ్‌కు చెందిన స్పేహా దూబే మొదటి పోస్టింగ్ విదేశాంగ శాఖలో జరిగింది.
- ఆ తర్వాత 2014లో స్పెయిన్‌లోని భారత దౌత్యకార్యాలయానికి బదిలీ అయ్యారు.
- ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పాక్ అసత్యాలు..
ఐరాస జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి మొసలి కన్నీరు కార్చారు. పాకిస్థాన్ ఉగ్రవాద బాధిత దేశమని పేర్కొన్నారు.
అఫ్గాన్ ప్రస్తుత పరిస్థితులకు అమెరికా నేతలు.. పాకిస్థాన్‌ను నిందిస్తున్నారు. కానీ 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదంపై అమెరికా జరిపిన పోరులో భాగస్వామి అయినందుకు అఫ్గాన్ తర్వాత ఎక్కువగా నష్టపోయింది మా దేశమే. అమెరికాకు సాయం చేయడం వల్ల 80 వేల మంది పాకీస్థానీలు బలయ్యారు. దేశంలో అంతర్గత కలహాలు, అసమ్మతి ఎదురైంది. ఇంత చేసినా మాకు ప్రశంసల బదులు, అపనిందలే వస్తున్నాయి. - ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని