ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శలు చేశారు. తాలిబన్ల డ్రగ్స్ కు తాడేపల్లి ప్యాలస్‌కు ఉన్న సంబంధమేంటని నారా లోకేశ్ ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాతో మొదలుపెట్టి ఇప్పుడు ఏపీని జగన్ రెడ్డి ఏకంగా డ్రగ్స్ డెన్‌గా మార్చేశారని ఆరోపించారు. దేశంలోని అత్యున్నత వ్యవస్థలన్నీ రాష్ట్రంవైపు వేలు చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఇతర రాష్ట్రాలను హెచ్చరిస్తుంటే ఏపీ డీజీపీ మాత్రం జగన్ భక్తిలో మునిగితేలుతున్నారని విమర్శించారు. డ్రగ్స్ డాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు ఆపి రాష్ట్ర పరువు కాపాడేందుకు శ్రద్ధ చూపాలని లోకేశ్ సూచించారు.
సూర్యాపేటలో గంజాయి స్వాధీనం
తెలంగాణ సూర్యాపేట జిల్లాలో 60 కేజీల గంజాయిని సీజ్ చేశారు కోదాడ రూరల్ పోలీసులు. రామాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీల్లో అనుమానంగా ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద 60 కేజీల గంజాయి పట్టుపడిందని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గంజాయి రవాణాతో సంబంధం లేదు
గంజాయి స్వాధీనం చేసుకున్న కేసుతో తన కుమారుడికి సంబంధం లేదని ఏపీలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. తన కుటుంబం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక తన కుమారుడిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. తన కుమారుడి కోసం తెలంగాణ సీఎంవో అధికారులను కలిశానని వస్తున్న వదంతులపై మండిపడ్డారు.
Also Read: రూ.9 వేల కోట్ల హెరాయిన్ పట్టివేత.. అఫ్గాన్ టూ విజయవాడ వయా గుజరాత్
సామినేనికి పట్టాభి సవాల్
వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భానుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సవాల్ విసిరారు. తన కుమారుడిని రేపు హైదరాబాద్ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకొచ్చి, డ్రగ్ టెస్ట్ చేయించగలరా అని సామినేని ఉదయ భానును సవాల్ చేశారు. బ్లాడ్ సాంపిల్స్, హెయిర్ సాంపిల్స్ ఇచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. తాను కూడా డ్రగ్స్ టెస్ట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. టీడీపీ నేతలందరూ కూడా డ్రగ్స్ టెస్ట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వైసీపీ వాళ్లు డ్రగ్స్ టెస్ట్ కి వస్తారా అని ప్రశ్నించారు. గంజాయి రవాణాతో సంబంధంలేదని మీడియా ముందు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.
Also Read: డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?