ఏపీలో తొలిసారిగా ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్‌తో ఓ ఆస్పత్రిని నిర్మించారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కేవలం 28 రోజుల్లోనే 100 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావడం విశేషం. ఒంగోలులోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి ఆవరణలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇండో-అమెరికన్ ఫౌండేషన్ సహకారంతో ఈ ఆస్పత్రిని అతి తక్కువ రోజుల్లోనే నిర్మించారు. దీనికోసం రూ.3.50 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి పనులు దాదాపు పూర్తికాగా, మరో వారం రోజుల్లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆసుపత్రిని ప్రారంభిస్తారని సమాచారం.
15 ఏళ్లపాటు చెక్కు చెదరదు..
ఏపీ ప్రభుత్వం ఫ్యాబ్రికేటెడ్ ఆస్పత్రిని తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించారు. అయితే 10 నుంచి 15 ఏళ్లపాటు ఈ నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉంటాయని అధికారులు తెలిపారు. ఏపీఎస్‌ఎంఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు దీని నిర్మాణం, నాణ్యతపై భరోసా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ పూర్తిగా మారనుందని, భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు మరిన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం..
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ ఆసుపత్రుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒంగోలులో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిని పూర్తిగా కొవిడ్19 రోగుల కేసం వినియోగించనున్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు మొదలుపెట్టింది. తాజాగా నిర్మించిన ఈ ఆస్పత్రిలో 11 బ్లాక్ లు ఉన్నాయి. ఓపీ సేవలకు ఒక బ్లాక్, డ్యూటీ డాక్టర్లు ఉండేందుకు మరో బ్లాక్ కేటాయిస్తారు. మిగిలిన 9 బ్లాక్ లను కొవిడ్19 బాధితుల కోసం వినియోగిస్తారు. 8 ఐసీయూ బెడ్స్, మిగతావన్నీ నాన్ ఐసీయూ బెడ్స్ ఏర్పాటుచేశారు.
Also Watch: పలాస, టెక్కలి మధ్య తీరం దాటనున్న గులాబ్ తుపాను.. ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ మంత్రి
వసతులకు లోటు లేదు..
కరోనా పేషెంట్ల గురించి ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. తాజాగా ఇలాంటి ఆసుపత్రిల్ని సకల వసతులతో నిర్మిస్తోంది. పేషెంట్ల కోసం 9 బ్యాక్‌లుండగా.. ఒక్కో బ్లాక్ లో 13మంది వైద్య సేవలు పొందేలా డిజైన్ చేశారు. ప్రతి బెడ్ వద్ద సీలింగ్ ఫ్యాన్, ఇతరత్ర సదుపాయాలున్నాయి. బ్లాక్ లోనే బాత్రూమ్, టాయిలెట్ సౌకర్యం కూడా ఉంటుంది. విద్యుత్, తాగునీటి సౌకర్యం ,ఇతరత్రా సౌకర్యాలు ఇక్కడ కల్పించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కొవిడ్ సేవలు అందుబాటులో ఉండేవి. కేసులు ఒక్కసారిగా పెరిగితే తలెత్తే ఇబ్బందుల నేపథ్యంలో కొవిడ్ సేవలకోసం ఫ్యాబ్రికేటెడ్ ఆస్పత్రిని ప్రత్యేకంగా నిర్మించారు. కరోనా అంతమైతే ఈ 100 పడకల ఆస్పత్రిని నాన్ కొవిడ్ సేవలకు వినియోగించడానికి ప్లాన్ చేశారు.
Also Read: ఏపీలో కొత్తగా 1,184 కరోనా కేసులు.. ఓ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతున్న కోవిడ్19