ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు ఉపఎన్నికలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే భార్య డాక్టర్ సుధను అభ్యర్థిగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్‌ను గతంలోనే ఖరారు చేశారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక అందరి చూపు బీజేపీ - జనసేన కూటమి వైపే ఉంది. ఈ ఉపఎన్నికపై ఇంత వరకూ బీజేపీ - జనసేన నేతలు సమావేశం కాలేదు. వారి సమన్వయ కమిటీ కూడా సమావేశం కాలేదు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు బద్వేలు బరిలో ఉమ్మడి అభ్యర్థి ఉంటారని ప్రకటించారు. జనసేన నేతలతో ఈ అంశంపై చర్చించి ఉమ్మడి ప్రకటన చేస్తామని చెప్పుకొచ్చారు. 


Also Read : వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నం ! అప్పుడేం జరిగిందంటే ?


జనసేన పార్టీ  బద్వేలు ఉపఎన్నికల విషయంలో ఎలాంటి ఆలోచనతో ఉన్నతో ఇంత వరకూ స్పష్టత లేదు. 2019 ఎన్నికల్లోనూ జనసేన పార్టీ అక్కడ పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా బహుజన సమాజ్ పార్టీకి కేటాయించారు. అక్కడ్నుంచి పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి అసలేమాత్రం ప్రభావం చూపలేకపోయారు. నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకుని ఆరో స్థానంలో ఉండిపోయారు. బద్వేలులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అధికంగానే ఉన్నప్పటికీ జనసేన పార్టీ పోటీ చేయకపోవడం వల్ల ఇతరులకు ఆ ఓట్లు బదిలీ కాలేదన్న అభిప్రాయం ఉంది. 


Also Read : మెంటల్ కృష్ణని పిచ్చాసుపత్రిలో చేర్చమన్న మెగా డాటర్, పాత వీడియో పోస్ట్ చేసిన నాగబాబు.


గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కమ్యూనిస్టులు, బీఎస్పీతో జత కట్టారు. ఎన్నికల తరవాత వారితో కటిఫ్ చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఆ రెండు పార్టీ మధ్య ఉన్న   సుహృద్భావ సంబంధాలపై అనేక రకాల ప్రచారాలు ఉన్నప్పటికీ అధికారికంగా అయితే పొత్తులో ఉన్నారు. తిరుపతి ఉపఎన్నికలో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు బద్వేలులోనూ కలిసి పోటీ చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. అయితే ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారన్నది మాత్రం స్పష్టత లేదు. 


Also Read: నా శ్వాస ఉన్నంత వరకూ మీరే నా దైవం..బండ్ల గణేష్ ట్వీట్ వైరల్


గత ఎన్నికల్లో  జనసేన మద్దతిచ్చిన బీఎస్పీ 1321 ఓట్లు సాధించి ఆరో స్థానంలో ఉంటే ఒంటరిగా పోటీచేసిన బీజేపీ ఇంకా దారుణమైన ఫలితాన్ని చూసింది. మొత్తంగా 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. పైగా బీజేపీ తరపున పోటీ చేసింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిరువీధి జయరాములు. వైసీపీ తరపున గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరారు.  అక్కడ టిక్కెట్ ఇవ్వరన్న ఉద్దేశంతో బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. అయిన బీఎస్పీ కన్నా తక్కువ ఓట్లు సాధించారు. ఇప్పుడు జనసేన- బీజేపీ కలసి పోటీ చేసినా ప్రభావం చూపడం కష్టమేనన్న అబిప్రాయం ఉంది. తిరుపతి ఉపఎన్నికల్లో తామంటే తాము పోటీ చేస్తామని రెండు పార్టీల అభ్యర్థులు పోటీ పడ్డారు కానీ ఇప్పుడు మీరంటే మీరు పోటీ చేయమని ఒకరికొకరరు ఆఫర్లు ఇచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. 


Also Read : బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి