Breaking News Live: ఆచార్యకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 Apr 2022 06:07 PM
Acharya: ఆచార్యకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో ఆచార్య సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ధరలు పెంచుకోవచ్చని జీవోలో పేర్కొంది. ఏప్రిల్‌ 29 నుంచి మే 5 ఐదు వరకు ధరలు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్షుల్లో 50 రూపాయల వరకు సాధారణ థియేటర్‌లలో 30 రూపాయల వరకు టికెట్‌ రేట్లు పెంచుకోవచ్చు. దీంతోపాటు వారం రోజుల పాట ఐదు ఆటలు వేసుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

తెలంగాణలో 16 వేల పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల 

తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 80 వేలకు పైగా ఉద్యోగాల్లో తొలి నోటిఫికేషన్ విడుదలైంది. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం విడుదల అయింది. కానిస్టేబుల్,  ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 16,027 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

Mancherial: భార్యతో గొడవ పెట్టుకొని కొడుకుని నేలకేసి కొట్టి చంపిన తండ్రి

భార్యతో గొడవ పెట్టుకొని ఓ వ్యక్తి తన కొడుకును చంపిన ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. బాలుడిని కన్న తండ్రే నేలకేసి కొట్టి చంపడం సంచలనంగా మారింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఈ ఘటన జరిగింది. పిల్లాడు ఏడుస్తున్నాడనే కారణంతోనే విసుగు చెంది భార్యతో గొడవపడ్డాడని తెలుస్తోంది. అనంతరం కొడుకుని నేలకేసి కొట్టి చంపాడు. ఆ ఫుటేజీ మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Minister Vidadala Rajini: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి విడదల రజని

సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి విడదల రజిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ ఎంవీ సూర్య కళ స్వాగతం పలికి ముందుగా కప్ప స్తంభం ఆలింగనం చేయించి నాదస్వరాలతో బేడా ప్రదక్షిణ చేయించి స్వామివారి దర్శనం చేయించారు. తర్వాత వేద పండితులతో వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి ప్రసాదాలను. అందజేశారు. మంత్రి పదవి పొందిన తర్వాత విడదల రజని విశాఖ రావడం ఇదే తొలిసారి.

Warangal: పెళ్లైన మూడు వారాలకే భర్త గొంతు కోసిన భార్య

వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. పెళ్లి జరిగిన మూడు వారాలకే ఓ భార్య తన భర్తపై కిరాతకానికి పాల్పడింది. బ్లేడుతో భర్త గొంతు కోసి హత్యాయత్నం చేసింది. పెళ్లైన మూడు వారాలకే నవ వధువు ఈ దారుణానికి ఒడిగట్టింది. రక్తపు మడుగులో ఉన్న అతణ్ని హుటాహుటిన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

KCR In Yadadri: యాదాద్రిలో కేసీఆర్ దంపతులు - మహా కుంబాభిషేకంలో పాల్గొన్న సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాదాద్రికి చేరుకున్నారు. పురోహితులు, అర్చకులు రుత్విక్ యాగ్నిక బృందం నేత్రుత్వంలో ఆలయ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు కొనసాగే మహా పూర్ణాహుతి మహా కుంభాభిషేకం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.

Vidadala Rajini: స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న మంత్రి విడదల రజిని

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి విడదల రజిని విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విశాఖ వచ్చిన విడదల రజని పీఠాధిపతుల ఆశీస్సుల కోసం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. వైద్య ఆరోగ్య శాఖను విజయవంతంగా నిర్వహించేలా దీవించమంటూ పీఠాధిపతులను కోరారు. అనంతరం రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Karimnagar Accident: కరీంనగర్‌లో ఘోర ప్రమాదం, ఇద్దరి మృతి

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నగునూరు రుక్మపూర్ శివారులో సోమవారం ఉదయం హార్వెస్టర్, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి అక్కడికక్కడే చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. మృతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Background

దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాంలపై ఉంది. ఈ ప్రాంతాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో వాతావరణం చల్లగా ఉంటుంది, మరో మూడు రోజుల తరువాత ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలో, తెలంగాణలో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో..
ఈ ప్రాంతాల్లో ఈరోజు వాతావరణ పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయి. విశాఖ నగరంతో పాటుగా చుట్టుపక్కన ఉండే ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, పాడేరు జిల్లాల్లో తీవ్రమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలుంటాయి. విశాఖ నగరంలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల​ వరకు నమోదవ్వనుంది. దీనికి తోడుగా తేమ గాలిలో అధికంగా ఉండటం వల్ల ఉక్కపోత విపరీతంగా ఉంటుంది. మరో వారంపాటు ఇలాంటి వాతావరణం కొనసాగనుంది. తూర్పు గోదావరి, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎండల తీవ్రత 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండి రాత్రికి కాస్తంత చల్ల పడనుంది. 


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. ఈ ప్రాంతాలకు ఎలాంటి వర్షసూచన లేదు. నెల్లూరు, ఒంగోలులో మాత్రం వేడి కంటే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.  చిత్తూరు, కర్నూలు, కడప​, ప్రకాశం జిల్లాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. రాయలసీమ జిల్లాల్లో నంద్యాల బెల్ట్, కడప​-అనంతపురం​ ప్రాంతాల్లో ఎండలు విపరీతంగా ఉంటున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని సూచించారు. కర్నూలు జిల్లా అవుకు లో 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. నగరాల వారీగా తిరుపతి నగరంలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదయ్యింది. 


తెలంగాణలో వెదర్ అప్‌డేట్స్..
నేటి నుంచి మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాలనే మేఘాలు కమ్ముకున్నా, వేడి ప్రభావం మాత్రం అధికం. గరిష్ట ఉష్ణోగ్రత 40, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని బేగంపేటలో అత్యధికంగా 38.5 డిగ్రిల ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ, నైరుతి దిశల నుంచి గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.