Allu Arjun to visit Kims hospital in Secunderabad | హైదరాబాద్: ఐకాన్ స్టార్, టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. అల్లు అర్జున్ మంగళవారం ఉదయం 9.30 - 10 గంటల సమయంలో కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. 


అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు


అయితే కిమ్స్ హాస్పిటల్‌కు పరామర్శకు వెళ్లే విషయంపై పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌కు రాంగోపాల్ పేట్ పోలీసులు ఇదివరకే నోటీసులు ఇచ్చారని తెలిసిందే. కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా నోటీసులలో అల్లు అర్జున్‌కు పోలీసులు సూచించారు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన సందర్భంగా ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యత వహించాల్సి వస్తుందని బన్నీని పోలీసులు హెచ్చరించారు. రెగ్యూలర్ బెయిల్ రావడంతో మొదట శనివారం నాడు నాంపల్లి కోర్టుకు వెళ్లిన నటుడు వ్యక్తిగత పూచీకత్తుతో పాటు సంబంధిత పత్రాలను  సమర్పించారు. మరుసటి రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు సైతం వెళ్లి వ్యక్తిగత పూచీత్తు వివరాలు, సంబంధిత పత్రాలను పోలీసులకు ఇచ్చారు. దాదాపు రెండు నెలలపాటు ప్రతి ఆదివారం ఆయన పీఎస్‌కు వెళ్లి వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. సాక్ష్యులను, బాధితులను ప్రభావితం చేయకూడదని నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా అల్లు అర్జున్‌ను ఆదేశించింది.


తొక్కిసలాట ఘటనతో బన్నీపై కేసు


కాగా, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని రేవతి చనిపోయారు. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురికాగా, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల రోజులు గడిచినా శ్రీతేజ్ ఆరోగ్యం కొంచెం కుదటపడింది కానీ బాలుడు ఇంకా కోలుకోలేదు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు 18 మందిని నిందితులుగా చేర్చారు. అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చి అరెస్ట్ చేయడం తెలిసిందే. నాంపల్లి కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించగా, అదే రోజు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. రేవతి కుటుంబానికి పుష్ప 2 మూవీ టీమ్ ఆర్థిక సాయం అందించింది. హీరో అల్లు అర్జున్ రూ. 1 కోటి రూపాయలు, నిర్మాతలు రూ.50 లక్షలు, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షల చొప్పున ఆర్థికసాయం చేశారు.


Also Read: Pushpa 2: ‘బాహుబలి 2’ని దాటవేసిన ‘పుష్ప 2’ - అఫీషియల్‌గా ప్రకటించిన నిర్మాతలు!