BRS MLC Kavitha | ఆసిఫాబాద్: ప్రజల పక్షాన గుంతెత్తే వారిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఏసీబీ కేసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భయపడేదే లేదని తేల్చిచెప్పారు. ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పక్షాన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు.
ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు
ఎమ్మెల్సీ కవిత సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో బాధితులని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఆపై వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందిన శైలజ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.2 లక్షల రూపాయల ఆర్థిక సాయం కుటుంబానికి అందించారు.
అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. రూ. 12 వేలకు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆరోపించారు. అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో పార్టీ నేతల్ని వేధిస్తుందని వివరించారు.
వారి త్యాగాలు వెలకట్టలేనివి
ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన ఆదివాసీ గిరిజనులు ఎందరో అమరులయ్యారని కవిత పేర్కొన్నారు. వారి త్యాగాలు వెలకట్టలేనివి అన్నారు. ఆ పోరాటాల పట్ల గౌరవంతో ఆదివాసీ గిరిజనులకు భూములపై హక్కులు ఉండాలని భావించిన మాజీ సీఎం కేసీఆర్... బీఆర్ఎస్ హయాంలో 4.5 లక్షల ఎకరాలకు సంబంధించి గిరిజనులు, ఆదివాసీలకు హక్కులు కల్పించారని ఆమె గుర్తు చేశారు.
మరోవైపు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వాంకిడీ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని మృతిచెందిన బాలిక శైలజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. గతంలో నిమ్స్ ఆస్పత్రిలో శైలజ చికిత్స పొందుతుండగా ఎమ్మెల్సీ కవిత పరామర్శించిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ శైలజ మరణించినట్లు తెలుసుకున్న కవిత చలించిపోయారు. ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించారు.
శైలజ కుటుంబానికి ఆర్థిక సాయం
ఇటీవల ప్రకటించిన రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని స్వయంగా బాలిక నివాసానికి వెళ్లి ఎమ్మెల్సీ కవిత అందించారు. శైలజ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, జైనూరు బాధితురాలిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, అనిల్ జాదవ్ తదితరులు ఉన్నారు.