Breaking News Live Telugu Updates: పదో తరగతిలో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 06 Jun 2022 09:52 PM
పదో తరగతిలో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య 

పదో తరగతి ఫెయిల్ అవ్వడంతో విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కుటాగులవారిపల్లె చెందిన ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. పదో తరగతి ఫెయిల్ కావడంతో మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకొన్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. 

JP Nadda In Vijayawada: ఆంధ్రాకి బీజేపీ అవసరం చాలా ఉంది - జేపీ నడ్డా

ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అవసరం బాగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశం విజయవాడలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నడ్డా పాల్గొని ప్రసంగించారు. విజయవాడలో సమావేశం అవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధిపై సమష్ఠిగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలని, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే మనం ఉన్నామని అన్నారు. అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం ఇదని అన్నారు. ఏపీలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయని, ప్రతి శక్తి కేంద్రంలోకి ఐదారు పోలింగ్ బూత్ లు వస్తాయని అన్నారు. ప్రతి బూత్ కమిటీలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిథ్యం ఉండాలని అన్నారు. కమిటీల ఏర్పాటు ప్రక్రియ నెలలో పూర్తి కావాలని సూచించారు.

JP Nadda In Vijayawada: విజయవాడకు చేరుకున్న జేపీ నడ్డా, కాసేపట్లో బహిరంగ సభకు హాజరు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయవాడకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నడ్డా విజయవాడ బయల్దేరారు. సిద్దార్ధ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ ఆవరణలో భారీ సభలో నడ్డా పాల్గొని ప్రసంగించనున్నారు.

AP SSC Exams Results: పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత

  • ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స

  • పదో తరగతిలో 4.14 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత

  • పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత

  • పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

  • ఫలితాల్లో ప్రకాశం ప్రథమ స్థానం, అనంతపురం ఆఖరి స్థానం

  • ఫలితాల్లో 78.3 శాతంతో ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా

  • ఫలితాల్లో 49.7 శాతంతో ఆఖరి స్థానంలో అనంతపురం జిల్లా

  • వచ్చేనెల 6 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

AP SSC Results: ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షల ఫలితాలను నేటి మధ్యాహ్నం (జూన్ 6)న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. విజయవాడ ఎమ్‌జీ రోడ్డు వద్ద నున్న గేట్‌వే హోటల్‌ లో ఫలితాలు విడుదల కార్యక్రమం నిర్వహించారు. వాస్తవానికి గత శనివారం (జూన్ 4న) టెన్త్ రిజల్ట్స్ విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఫలితాలు వాయిదా పడ్డాయి. ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.in లో సోమవారం తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది.

BJP Leaders Protest: గన్నవరం ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతల ఆందోళన

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిన బీజేపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ నేతలను ఎయిర్ పోర్టు లోపలికి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. భద్రతా కారణాలతో పార్టీ నేతలకు లోపలికి అనుమతించలేదని తెలుస్తోంది. మరికాసేపట్లో నడ్డా గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకోనున్నారు.

Nuzvid IIT Student Suicide: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఆర్.నితీష్ కుమార్ అనే విద్యార్థి అర్ధరాత్రి హాస్టల్ రూంలో నోటి వెంట నురగతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన తోటి విద్యార్థులు నితీస్‌ను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం విజయవాడకు తరలించగా, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన విద్యార్థి స్వగ్రామం నెల్లూరు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు భావిస్తున్నారు.

Tirupati Airport News: తిరుపతి విమానాశ్రయంలో విమానం నిలిపివేత

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విశాఖపట్నం ఎయిర్ పోర్టు కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్ వేపై తాత్కాలికంగా నిలిపి వేశారు అధికారులు.. విశాఖపట్నంలో వాతావరణం అనుకూలించక పోవడంతో రన్ వేపై తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని ఇండిగో విమానం సిబ్బంది అంటున్నారు.. అయితే రన్ వేపై నిలిపి వేసిన ఇండిగో విమానంలో ఆక్సిజన్ లేక పోవడం, కనీసం ఏసీలు వేయక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. తమను లాంజ్ లో కూర్చో పెట్టమని ప్రయాణికులు ప్రాధేయ పడుతున్నా, అవేవి పట్టించుకొని విమాన సిబ్బంది  మరికొద్ది సేపట్లో విశాఖలో వాతావరణం అనుకూలిస్తుందని, వేంటనే విమాన సర్వీసు నడుస్తుందని నమ్మిస్తున్నారు.. గంటకు పైగా రన్ వేపై విమానం నిలిపి వేయడంతో విమానంలోని చిన్నారులు, వృద్దులు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు.

Kinnera Mogilaiah: కిన్నెర మొగులయ్యకు ఇంటి స్థల పరిశీలన

పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు బాగ్‌ హయత్‌ నగర్‌లోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్‌ 159లో సుమారు 600 గజాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఈ స్థలాన్ని ఆర్‌డీవో వెంకటాచారి, తహసీల్దార్‌ సంధ్యారాణి ఆదివారం పరిశీలించారు. స్థలాన్ని చదును చేయించారు. ఈ సమయంలో ఎంఆర్‌ఐ నరసింహ యాదవ్‌, ఆర్‌ఐ ప్రసాద్‌ శర్మ, సర్వేయర్‌ సాయికృష్ణా రెడ్డి, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ రాజేందర్‌, వీఆర్‌ఓ సత్యనారాయణ, వీఆర్‌ఏలు మల్లేష్‌, ఆంజనేయులు ఉన్నారు.

JP Nadda AP Tour: నేడు ఏపీ పర్యటనకు జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda) నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈవెంట్లలో భాగంగా నేడు ఏపీకి జేపీ నడ్డా రానున్నారు. ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా విజయవాడ, రాజమహేంద్రవరాల్లో పలు కార్యక్రమాలకు హాజరు అవుతారు. నేడు  విజయవాడలో బీజేపీ శక్తికేంద్రాల ఇన్‌చార్జీలు, కోర్‌ కమిటీ నేతలతో భేటీలలో పాల్గొననున్న జేపీ నడ్డా, మంగళవారం సాయంత్రం రాజమండ్రిలో బహిరంగ సభకు హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏపీకి రానుండటంతో పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం కనిపిస్తోంది.

Hanamkonda: హన్మకొండ జిల్లాలో దారుణం, కన్న కొడుకుని గొడ్డలితో నరికిన తండ్రి

హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో కన్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. కుటుంబంలో గొడవల కారణంగా కన్న తండ్రి మాచర్ల కుమారస్వామిపై కుమారుడు శ్రీకాంత్ (32) గొడ్డలితో పోటు వేశాడు. దీంతో అదే గొడ్డలితో కుమారుడిపై కుమారస్వామి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Background

నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు అల్పపీడన ద్రోణి సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 


నైరుతి రుతుపవనాలు ఉత్తర పరిమితి పయనం 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, కార్వార్, చిక్ మంగులూరు, బెంగుళూరు, ధర్మపురి, 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 80 డిగ్రీల తూర్పు రేఖాంశం, 11 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83 డిగ్రీల తూర్పు రేఖాంశం, 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86 డిగ్రీల తూర్పు రేఖాంశం, 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 89 డిగ్రీల తూర్పు రేఖాంశం, సిలిగురి, 27.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 88 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. ఏపీలో కోస్తాంధ్రలో 2 నుంచి 4 డిగ్రీల వరకు కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాయలసీమలో వేడి గాలులు వీచడంతో పాటు తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఓ వైపు వర్షాలు, మరోవైపు ఉక్కపోత అధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
నేడు ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి సైతం ఈ ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. శ్రీకాకుళం నగరంతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలోని వివిధ భాగాలు ముఖ్యంగా ఆముదాలవలస​, రజాం, రణస్ధలంలలో వర్షాలు, పిడుగులు వడే అవకాశం ఉంది. పార్వతీపురం మణ్యం జిల్లాలో కూడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో విస్తారమైన కురుస్తాయి.  పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఒక పక్కనేమో కడప జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, మరోవైపు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు - చీరాల మొత్తం భాగంలో విపరీతమైన పిడుగులు, తీవ్ర వర్షాలు పడుతున్నాయి. కడప జిల్లా ఉత్తర భాగాల్లో వర్షాలు భాగా విస్తారంగా ఉన్నాయి. ఇవి నేరుగా నల్లమల అటవీ ప్రాంతం మీదుగానే అనంతపురం జిల్లాతో పాటుగా నంద్యాల, కర్నూలు జిల్లాలోని పలు భాగాల్లోకి, కడప జిల్లాలోని ప్రొద్దట్టూరు, జమ్మలమడుగు మీదుగా అనంతపురం జిల్లా వైపుగా వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


తెలంగాణలో వడగాల్పులు, వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వడగాల్పులు వీచ్చే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మరో 3 రోజులపాటు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం వేళ చల్లని గాలులు వీస్తుండగా.. మధ్యాహ్నం ఎండ కంటే ఉక్కపోత ప్రభావం అధికంగా ఉంటుంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.